
ఫ్యూచర్‌సిటీ రైతులతో సమావేశమైన అధికారులు
కందుకూరు: ఫ్యూచర్‌సిటీ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ రైతులతో పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం అధికారులు సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న సర్వే నంబర్ 120, 121లోని రైతులతో మాట్లాడారు. రహదారి నిర్మాణంలో పూర్తిగా భూమి కోల్పోయి, ఎలాంటి ఆధారం లేని రైతు కుటుంబానికి పరిహారంతో పాటు మేజరైన ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.5.50 లక్షల చొప్పున పునరావాసం కింద అందుతుందని ప్రతిమాసింగ్ వివరించారు. మిగతా రైతులకు భూసేకరణ ప్రక్రియ ప్రకారం నిర్ణయించిన పరిహారం అందుతుందన్నారు. కేవలం భూమి మొత్తం కోల్పోతూ, ఎలాంటి ఇతర ఆధారం లేని వారికి మాత్రమే అదనపు పరిహారం వర్తిస్తుందని తెలిపారు. అలాంటి వారు ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీశారు. వివరాలు అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలే లాభదాయకం
ఇబ్రహీంపట్నం రూరల్: ఆరుతడి పంటలే అన్నదాతలకు లాభదాయకమని తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మండలంలోని పోల్కంపల్లిలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయం లాభాసాటిగానే ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలబడిన ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. అడ్డగోలుగా కృత్రిమ ఎరువులు వినియోగించొద్దని సూచించారు. అవసరం మేరకు రసాయనాలు వినియోగించి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పంట మార్పిడి విధానాన్ని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు సునీత, శ్రీనివాస్‌రెడ్డి రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి విద్యాధరి, ఏఈఓ శ్రవణ్‌కుమార్, సృజన తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
నాణ్యమైన విద్య
డీఈఓ సుశీందర్‌రావు
తుక్కుగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని డీఈఓ సుశీందర్‌రావు పేర్కొన్నారు. పురపాలిక సంఘం పరిధిలోని తుక్కుగూడ, సర్ధార్‌నగర్, మంఖాల్ గ్రామాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలే నిదర్శనమన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి, మంచి భవిష్యత్‌ను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నానాయక్, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫ్యూచర్‌సిటీ రైతులతో సమావేశమైన అధికారులు

ఫ్యూచర్‌సిటీ రైతులతో సమావేశమైన అధికారులు