పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలి | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలి

Published Tue, May 7 2024 7:00 PM

పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్‌ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా నియమించిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్‌ కుమార్‌ కటారియా కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్‌ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఆర్‌ఓ సంగీత, మాస్టర్‌ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

చేవెళ్ల: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక అధికారులకు సూచించారు. చేవెళ్లలోని బండారి శ్రీనివాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ కళాశాలలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో చేపట్టిన కమిషనింగ్‌ ప్రక్రియను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌లలో బ్యాలెట్‌ పేపర్‌, అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. కమిషనింగ్‌ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ఈవీఎంలను అన్ని విధాలా సిద్ధం చేయాలని.. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కమిషనింగ్‌ ప్రక్రియ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా కమిషనింగ్‌ జరిపించాలని సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్న తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట చేవెళ్ల ఆర్డీఓ సాయిరాం, ఇతర అధికారులు ఉన్నారు.

కలెక్టర్‌ శశాంక

 
Advertisement
 
Advertisement