
జ్యోతి మృతదేహం
ఇబ్రహీంపట్నం రూరల్: కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. మూడు మూళ్ల బంధంతో ఏడు అడుగులు వేసినవాడే బంధం తెంచుకున్నాడు. అనుమానం పెనుభూతమై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నెరడుగొమ్మ మండలం మోసగడ్డ తండాకు చెందిన బానోతు జ్యోతి (33), జబ్బర్‌లాల్ దంపతులు. ఇద్దరు పిల్లలతో కలిసి కొన్నేళ్ల క్రితం తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని సూరజ్‌నగర్ కాలనీకి వలసవచ్చారు. జబ్బర్‌లాల్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా, జ్యోతి ఇళ్లలో పని చేసి జీవనం సాగించేవారు. భార్యపై అనుమానం పెంచుకున్న జబ్బర్‌లాల్ వివాహేతర సంబంధం ఉందని తరచూ గొడవపడేవాడు. తాజాగా శనివారం అర్ధరాత్రి రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కోపంతో జబ్బర్‌లాల్ భార్య జ్యోతి కడుపులో కత్తితో పొడిచాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు గమనించి 108లో నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల రోదన చూసి అక్కడున్నవారు కన్నీరు పెట్టారు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు జబ్బర్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త
తరచూ గొడవ.. కత్తితో పొడిచి హత్య
కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు