గన్‌ఫౌండ్రీ: ఆసియా ఖండంలోనే పాటల రచయితకు మొట్టమొదటిసారి ఆస్కార్ ఆవార్డు దక్కడం గొప్ప విషయమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ, గ్రంథాలయ పరిషత్, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదికలతో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 95 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో కవులే లేరని, గతంలో అవహేళన చేశారని కానీ నేడు విశ్వవ్యాప్తంగా తెలంగాణ కవులు సత్తా చాటడం ఆనందంగా ఉందన్నారు. ఆస్కార్ అవార్డు సాధించిన చంద్రబోస్‌ను త్వరతలో ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ఆస్కార్ అంటే హాలివుడ్‌కు మాత్రమే పరిమితమైందని, కానీ చంద్రబోస్ ఆ చరిత్రను తిరగరాశారని కొనియాడారు.
కవిగా గర్వించే క్షణాలు: చంద్రబోస్
ఒక కవిగా తనకు లభించిన ఈ గుర్తింపు ఎంతో గర్వించదగ్గ క్షణాలని సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. ‘నాటు నాటు’ పాట కోసం సంగీత దర్శకుడు కీరవాణితో పాటు తాను సంవత్సరం పాటు చేసిన కృషికి ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నాటు నాటు పాటపాడి సభికులను ఆనందపరిచారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, చంద్రబోస్ తండ్రి నర్సయ్యలతో పాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రబోస్‌కు త్వరలో సన్మానం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి