
రాజేంద్రనగర్: గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు చేపడుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడిచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుద్వేల్ పాత మున్సిపల్ కార్యాలయం పక్కనే గతంలో నిర్మించిన ప్రహరీ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. దీని పక్కనే నాగులు అనే వ్యక్తి ఇంటిని నిర్మించి తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన నాగులు మనమడు వినోద్ మొయినాబాద్ హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందినవాడు. వినోద్‌తో కొందరు మీ తాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేసి బయటకు తీస్తామని వెల్లడించారు.
దీంతో 12 రోజుల క్రితం ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం మూడ్రోజులుగా తవ్వకాలు చేపట్టారు. రాత్రి సమయంలో పూజలు నిర్వహించడం, ఉదయం తవ్వకాలు చేపడుతుండడంతో చుట్టూ పక్కల వారికి అనుమానం వచ్చి రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి సదరు ఇంటిపై నిఘా పెట్టారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫలక్‌నూమా, బషీర్‌బాగ్, హిమాయత్‌సాగర్ ప్రాంతాలకు చెందిన ఖదీర్, కృష్ణమోహన్, దివ్యాసా, హరిప్రీత్‌సింగ్, విశ్వనాథ్, కట్ట శివసాయి, రామకృష్ణతోపాటు వినోద్‌ను అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి మూడు కార్లతో పాటు 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానం రాకుండా విందు
నాగులు ఇంట్లో 12 రోజుల క్రితం పూజలు నిర్వహించి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో స్థానికులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా విందు ఏర్పాటు చేసినట్లు నాగులు, వినోద్ వెల్లడించారు. దీంతో ఎవరికి అనుమానం రాలేదు. మూడు రోజులుగా మంత్రాలు, అరుపులు, కేకలు వేస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో గుప్త నిధుల విషయం బయటకు వచ్చింది.