
కంటి వెలుగు కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి
తుక్కుగూడ: జిల్లాలో ద్రాక్ష సాగును ప్రోత్సహిస్తామని మంత్రి పీ సబితారెడ్డి అన్నారు. తుక్కుగూడ పరిధిలో రైతు కే అంజిరెడ్డి సాగు చేసిన ద్రాక్ష తోటను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు అనేక రకాల పండ్ల తోటలను సాగు చేసేవారన్నారు. క్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందన్నారు. ఇతర పంటలు సాగు చేసిన రైతులు అనేక కష్టాల నష్టాలు భరించారని, ప్రస్తుతం పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించారని తెలిపారు. అంజిరెడ్డి తన 20 ఎకరాల్లో ద్రాక్ష పంటను సాగు చేశాడని, ఈ ఏడాది దిగుబడి బాగా వచ్చిందని తెలిపారు. కోహెడ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పండ్ల మార్కెట్లో ద్రాక్ష విక్రయాల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకోవడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన వన శాఖ అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
13వ వార్డులో ‘కంటి వెలుగు’
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితారెడ్డి సూచించారు. మంగళవారం తుక్కుగూడ 13వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టినదే కంటి వెలుగు అన్నారు. మానవ శరీరంలో కంటి చూపు ప్రధానమన్నారు. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సీ లావణ్య, మున్సిపల్ చైర్మన్ కే మధుమోహన్, కమిషనర్ బి.వెంకట్రామ్, వైస్ చైర్మన్ భవాని, కౌన్సిలర్లు రవినాయక్, సుమన్, రాజు, బీఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.
మంత్రి సబితారెడ్డి
తుక్కుగూడలో ద్రాక్ష తోట సందర్శన