బైపాస్‌ పనుల్లో కదలిక! | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌ పనుల్లో కదలిక!

Jul 6 2025 6:30 AM | Updated on Jul 6 2025 6:30 AM

బైపాస

బైపాస్‌ పనుల్లో కదలిక!

● మూడు నెలల నుంచి సాగుతున్న పనులు ● రేపు కాజీపేట–బల్లార్ష మార్గంలో జీఎం పర్యటన? ● ఇంటర్‌లాకింగ్‌ పనులకు ఇంకా విడుదల కాని షెడ్యూల్‌ ● కొనసాగుతున్న కరీంనగర్‌ ఆర్వోబీ పనులు ● నరకం చూస్తున్నామని ప్రజల ఆవేదన

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అనిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్‌ రైల్వేలైన్‌ విషయంలో శుభవార్త. ఇప్పటికే పూర్తయిన ఈ రైల్వేలైన్‌ను కాజీపేట– బల్లార్ష ప్రధాన లైన్‌తో కనెక్ట్‌ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇంటర్‌లాకింగ్‌ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సింది. మే నెలాఖరు నాటికి బైపాస్‌ రైల్వేలైన్‌ అందుబాటులోకి రావాల్సింది. ఆ సమయంలో కరీంనగర్‌–తిరుపతి రైలుకు పెద్దపల్లి స్టాప్‌ కూడా ఎత్తేశారు.

ఇక రైలు పెద్దపల్లికి వెళ్లకుండా నేరుగా.. బైపాస్‌ మీదుగా జమ్మికుంట వైపు వెళ్లేది. కానీ.. అపుడు ఎదురైన పలు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. కానీ... ప్రధాన లైన్‌కు 1.78 కి.మీల పొడవైన పెద్దపల్లి బైపాస్‌ లైన్‌ను కలపడం అంత సులువేం కాదు. ఢిల్లీ మార్గం కావడంతో అనేక రైళ్లను గంటలపాటు నిలపాల్సి ఉంటుంది. చాలా రైళ్లను దారి మళ్లించాల్సి ఉంటుంది. వేలాది కుటుంబాల ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అధికారులు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైళ్ల రద్దీ తక్కువ ఉన్న రోజున కనీసం 2 నుంచి 3 గంటల్లో ప్రధాన మార్గాన్ని బైపాస్‌ మార్గంతో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిని ఆమోదిస్తూ.. సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. ఈనెల 7వ తేదీ దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన ఉంది. ఆయన పర్యటన అనంతరం బైపాస్‌ మార్గం అనుసంధానం షెడ్యూల్‌పై స్పష్టత రానుంది.

ఆర్వోబీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు

కరీంనగర్‌ పట్టణంలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పుకున్నా.. ఆ మేరకు పురోగతి పనుల్లో కనిపించడం లేదు. ఈ మధ్య పిల్లర్ల పనుల్లో వేగంపెంచారు. ఇపుడున్న రైల్వే గేటు ప్రాంతంలో పిల్లర్లు నిర్మించాల్సిన నేపథ్యంలో రైల్వేగేటును పక్కకు మార్చారు. ఈ క్రమంలో చొప్పదండికి వెళ్లే క్రమంలో కుడివైపునకు తిరిగే క్రమంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. చొప్పదండి నుంచి కరీంనగర్‌కు వచ్చే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అపోలో వరకు, అటు తీగలగుట్టపల్లి అమ్మగుడి వరకు వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్‌ జాములతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు గేట్లు పడటం, ఈ కష్టాలకు వానలు తోడవటంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. స్కూలు బస్సులు, చిరువ్యాపారులతోపాటు ముఖ్యంగా అంబులెన్స్‌లో వచ్చే అత్యవసర రోగులు ఈ మార్గంలో రెట్టింపైన ట్రాఫిక్‌ కష్టాలతో అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే స్టేషన్‌కు అవతల నుంచి కిసాన్‌ నగర్‌ మీదుగా రైల్వే అండర్‌పాస్‌ మార్గం ఉంది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ట్రాఫిక్‌ పోలీసులు, బల్దియా, ఇతర ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కిసాన్‌నగర్‌ మార్గాన్ని అభివృద్ధి చేయాలి

మేంచిరు వ్యాపారులం. రోజులో కనీసం నాలుగైదుసార్లు రైల్వేగేటు దాటాల్సి ఉంటుంది. ఆర్వోబీ పనుల ఆలస్యంతో మాలాంటి వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పనులు వేగంగా చేయాలి. స్టేషన్‌ పక్కన ఉన్న అండర్‌పాస్‌ల మార్గం అభివృద్ధిచేసి ప్రచారం కల్పిస్తే.. ట్రాఫిక్‌ భారం కాస్త తగ్గుతుంది. అలాగే అంబులెన్స్‌లకు ఇబ్బందులు తప్పించినవారవుతారు.

– లక్ష్మణ్‌, చంద్రాపూర్‌ కాలనీ

బైపాస్‌ పనుల్లో కదలిక!1
1/1

బైపాస్‌ పనుల్లో కదలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement