
అనుబంధం దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారిన పరిస్థితులు కుటుంబాలను చిన్నవిగా చేశాయి. పల్లెల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం.. నగరాల్లో పిల్లలకు నాణ్యమైన చదువులు.. ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండడంతో పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలు కాస్త కనుమరుగవుతున్నాయి. కొడుకులు,, మనుమలు, మనుమరాళ్లతో నిండుగా కనిపించిన ఇళ్లు.. ఇప్పుడు బోసిపోయాయి. అదే సమయంలో సొంతూళ్లలోనే ఉంటున్న కొందరు వేరుకాపురాలు పెడుతూ అద్దె ఇళ్లకు మారుతున్నారు. ఏదేమైనా కాలం మనుషుల మధ్య దూరాలను పెంచేసింది. కొడుకులు, కోడళ్లు ఉద్యోగాలు అంటూ పట్టణాలకు వెళ్తుంటే.. ఊర్లలో పెద్దమనుషులు మాత్రమే మిగిలిపోతున్నారు. ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు గడిపిన ఆనంద క్షణాలను తలచుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.
● కనిపించని ఉమ్మడి కుటుంబాలు ● ఉపాధి..ఉద్యోగ వేటలో పట్నం బాటలో సంతానం ● జ్ఞాపకాలతోనే కాలం వెల్లదీస్తున్న పెద్ద మనుషులు