
తాటి వనం.. ఉపాధి ఘనం
● ఏడు ఎకరాల్లో ఈత, తాటిచెట్ల పెంపకం ● ఆదర్శణీయం కార్మికుల స్వయంకృషి ● 95 గీతాకార్మిక కుటుంబాలకు లాభం
ముస్తాబాద్(సిరిసిల్ల): తాటి, ఈతవనాలు కనుమరుగవుతుండడాన్ని ముస్తాబాద్‌కు చెందిన గౌడకులస్తులు రెండు దశాబ్దాల క్రితమే గమనించారు. ఏడు ఎకరాలు ప్రత్యేకంగా కొనుగోలు చేసి తాటి, ఈత మొక్కలు నాటారు. నేడు చెట్లుగా ఎదిగి స్వచ్ఛమైన కల్లును అందిస్తున్నాయి. ముస్తాబాద్ పట్టణంలోని గీతాకార్మికుల స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనంగా ఈత, తాటివనం నిలుస్తోంది.
ఐదేళ్ల క్రితం నాటిన మొక్కలు
మండల కేంద్రం చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కల్లుకు మంచి పేరు ఉండగా.. ముస్తాబాద్‌లో చెట్లు లేని చోట కల్లు దొరకదనే ప్రచారం ఉంది. దీంతో పదిహేనేళ్ల క్రితం ముస్తాబాద్ శివారులో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. ఐదేళ్ల క్రితం ఐదు ఎకరాల్లో తాటి, రెండు ఎకరాల్లో ఈతమొక్కలు నాటారు. ఒక బోరు వేసి నీటిని అందించారు. కల్లులో పోషకాలతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు ఉన్నాయన్న నమ్మకంతో చాలా మంది కల్లు సేవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల స్వచ్ఛమైన కల్లుకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలోనే 400 తాటి, 2వేల ఈత చెట్లను పెంచారు. వారి కృషి ఫలించి మొక్కలు చెట్లుగా ఎదిగాయి. ఇప్పుడు రోజుకు 500 లీటర్ల కల్లు వస్తుంది. కల్లుతోపాటు నీరా విక్రయాలు చేపడతామని గౌడకార్మికులు తెలిపారు.