
వార్షిక రుణప్రణాళిక రూ.4,890 కోట్లు
● డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి ● క్యూఆర్ కోడ్ లేని వ్యాపారులను గుర్తించాలి ● జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లా 2025–2026 వార్షిక రుణ ప్రణా ళికను రూ.4,890 కోట్లుగా నిర్ణయించారు. ఈమేరకు పంటరుణాలు, ప్రభుత్వ ప్రాధాన్యత రంగా లకు రుణాలు, విద్యారుణాలు, మహిళా సంఘాలకు రుణాలు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం బ్యాంకర్లతో త్రైమాసిక డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశంలో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణులకు అవసరమున్న చోట బ్యాంక్ నూతన బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు గల అవకాశాలు పరిశీలించాలని సూచించారు. 500 ఇండ్లు ఉన్న ఆవాసాలలో 323 బ్యాంకింగ్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. క్యూఆర్ కోడ్ లేని వ్యాపారులను గుర్తించి, బ్యాంకు ఖాతాలు ప్రారంభింపజేయాలని సూచించా రు. జన్‌ధన్ బ్యాంక్ ఖాతాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎంజేజేబీవై పథకాలలో నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పెంచాలని సూచించారు.
మహిళా సంఘాలకు..
జిల్లాలో 82 స్వశక్తి సంఘాలకు రూ.8.17కోట్లు, మెప్మా కింద 118 సంఘాలకు రూ.14.50కోట్లు బ్యాంకు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్ రుణాల పంపిణీ వేగవంతం చేయాలని, ఎంసీపీలను త్వరగా బ్యాంకులకు సమర్పించాలని కోరారు. స్వయంఉపాధిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద యువతకు రుణాలు అందించాలని, స్టాండ్ ఆఫ్ ఇండియా కింద 16 యూనిట్లకు రూ.2కోట్లు రుణాలు మంజూరు చేశామని, ముద్ర రుణాల కింద 8,220 మందికి రూ.101.24కోట్ల రుణాలు అందించామని, పీఎంఎఫ్‌ఎంఈలో 63 దరఖాస్తులను ఆమోదించామన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో జిల్లాలో 343 దరఖాస్తులను మంజూరు చేశామని అధికారులు వివరించారు.
వార్షిక రుణప్రణాళిక విడుదల
2025–26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణప్రణాళిక మొత్తం రూ.4,890కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా తయారు చేయడం జరిగింది. వీటిలో 92,428 మంది రైతులకు రూ.1,700 కోట్ల పంటరుణాలు, 22,525 మంది రైతులకు రూ.1,006 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలు, 10,082 మందికి రూ.277కోట్ల వ్యవసాయాధారిత రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.612.30 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించడం జరిగింది. ఆర్‌బీఐ ప్రతినిధి వి.సాయితేజ్‌రెడ్డి, నాబార్డు డీడీఎం దిలీప్‌చంద్ర, యూబీఐ రీజినల్ హెడ్ డి.అపర్ణరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ టి.మల్లికార్జున్‌రావు, డీఆర్డీవో శేషాద్రి, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, జీఎండీఐసీ హనుమంతు, ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి భవనం పూర్తి చేయండి
జిల్లా ఇందిరా మహిళా శక్తి భవనం పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల ము న్సిపల్ పరిధిలోని మెడికల్ కళాశాల సమీపంలో రూ.5కోట్లతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ ఏడాది నవంబర్‌లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంట గది, స్టోర్‌రూమ్ పరిశీలించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించారు.