
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్‌చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.
నేడు వేములవాడ–ముంబయి ఏసీ బస్సు ప్రారంభం
వేములవాడ: వేములవాడ నుంచి ముంబయికి వెళ్లేందుకు ఏసీ స్లీపర్ కోచ్ బస్సును రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం తెలిపారు. వేములవాడ నుంచి కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, పుణె మీదుగా ముంబయి చేరుకుంటుందని తెలిపారు. సిట్టింగ్ రూ.1,500, స్లీపర్ రూ.2వేలు చార్జీలు ఉన్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక మహాలింగేశ్వర ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ, మండల శాఖ నూతన కార్యవర్గాలను ఎన్నుకుంటున్నట్లు పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, చైతన్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహెబ్ పాల్గొన్నారు.
నేడు ఐఐహెచ్‌టీ కోర్సుపై అవగాహన సదస్సు
సిరిసిల్ల: కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) కోర్సుపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సిరిసిల్లలో సదస్సు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు రాఘవరావు తెలిపారు. 2025–2026 విద్యాసంవత్సరంలో 60 సీట్లు చేనేత, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ఉన్నట్లు వివరించారు. ఆ కోర్సు ప్రాధాన్యతను వివరించేందుకు బీవై నగర్‌లోని పాత ఏడీ ఆఫీస్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భగవద్గీత పఠనంలో గోల్డ్‌మెడల్స్
ముస్తాబాద్(సిరిసిల్ల): భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గోల్డ్‌మెడల్స్ సాధించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన కటకం లక్ష్మి, కటకం విజయలక్ష్మి మైసూర్‌లో జరిగిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో సత్తా చాటారు. 700 శ్లోకాలను అలవోకగా ఆలపించిన అక్కాచెల్లెళ్లకు గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాలను అందించారు.
కంచర్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వీర్నపల్లి(సిరిసిల్ల): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంచర్ల పంచాయతీ కార్యదర్శి ముక్తార్ అహ్మద్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం సస్పెండ్ చేశారు. గ్రామంలో డెంగీ కేసులు నమోదైనప్పటికీ పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో సస్పెండ్ చేశారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

సమస్యల పరిష్కారమే లక్ష్యం