
సరస్వతీ నమస్తుతే..
● విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం
● తొలిస్నానం ఆచరించిన శ్రీశ్రీ మాధవనంద సరస్వతిస్వామి
● మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్‌లోని త్రివేణి సంగమం, అంతర్‌వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది.
మొదటి రోజు భక్తుల తాకిడి..
తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు.
హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు
సరస్వతి నది పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధూ, కావేరి పేర్లను శిలాఫలకం రూపంలో తయారు చేసి ప్రదర్శించారు.
కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు
కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులను అభినందించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృత/్ఞతలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫుష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కరాలను భక్తులు ఆచరించాలని సూచించారు.

సరస్వతీ నమస్తుతే..