
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు
● కశ్మీర్‌లో కాపలాగా ఉన్న యువకులు
● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు
కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్‌రెడ్డి, అజ్జు, ఎగ్లాస్‌పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్‌రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్‌లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు.