
సర్వేయర్లతో భూ సమస్యలు పరిష్కారం
● రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
చందుర్తి(వేములవాడ): భూభారతి చట్టంలో దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ తర్వాత మండలానికి ఐదారుగురు సర్వేయర్లు వస్తారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రుద్రంగిలో 243 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. వాటి నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. భూ భారతిలో భాగంగా మండలంలో 1,300 దరఖాస్తులు స్వీకరించారని, జూన్ 2 తర్వాత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూభారతిలో భూముల రిజిస్ట్రేషన్‌తోపాటు హద్దులు, సర్వేయర్లు సర్వేచేసిన మ్యాప్‌లను పాసుబుక్‌లో ముద్రిస్తారని వివరించారు.
రెండు రెవెన్యూ భవనాలకు నిధులు
వేములవాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన రుద్రంగి, భీమారం మండలాల్లో రెవెన్యూ భ వన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. వేములవా డ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామన్నారు. ముంపు గ్రామాల బాధితులకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హులు మిగిలితే వారికి కూడా అందజేస్తామన్నారు. ఇందిరమ్మ పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చామని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరిక మేరకు అదనంగా మరో 1,750 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ప్రజలు ప్రశంసించేలా అభివృద్ధి : పొన్నం
ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించి, జిల్లాను ప్రజ లు ప్రశంసించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆర్టీసీ బస్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ నుంచి మంబయికి త్వరలోనే ఏసీ బస్సును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
అభివృద్ధి పనులకు నిధులు : సీతక్క
ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నాగారం చెరువు నుంచి కుక్కలగుట్టతండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తుందన్నారు. యూనిఫాంలు, పాఠశాలల బిల్డింగ్ నిర్మాణాలు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, ముందుకొచ్చే మహిళా సంఘాలకు రైస్‌మిల్లలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
రూ.150కోట్లతో ఆలయాభివృద్ధి : విప్ ఆది
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను రూ.150 కోట్లతో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ తీపీరెడ్డి మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, రుద్రంగి, వేములవాడ, కోనరావుపేట మార్కెట్ కమిటీల చైర్మన్‌లు చెలుకల తిరుపతి, రొండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు.