
పారిశుధ్య కార్మికుల భద్రత అందరి బాధ్యత
● డీఆర్డీవో శేషాద్రి
సిరిసిల్ల: గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. ‘యూనిసెఫ్ – స్వచ్ఛ భారత్’ సమన్వయంతో పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం అనే అంశంపై కలెక్టరేట్‌లో గురువారం ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త నిర్వహణ, సేంద్రీయ ఎరువుల తయారీ పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పని వాతావరణం ఏర్పాటు చేయాలని యూనిసెఫ్ శిక్షకుడు ఫణీంద్ర తెలిపారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, రక్షణ కవచాలు ఇచ్చి వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. యూనిసెఫ్ సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ శిక్షకుడు రమేశ్, సిరిసిల్ల స్వచ్ఛ భారత్ కో ఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. డీఎల్పీవో నరేశ్, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.