
జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు
● మనుషుల నుంచి జంతువులకు కూడా..
● వరల్డ్ జూనోసిస్ డేలో జిల్లా పశుసంవర్థక శాఖాధికారి రవికుమార్
● పెంపుడు కుక్కలకు టీకాలు
ఒంగోలు సబర్బన్: జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయని, అదేవిధంగా మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాధులు సంక్రమిస్తాయని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి బి.రవికుమార్ తెలిపారు. వరల్డ్ జూనోసిస్ డేని పురస్కరించుకుని స్థానిక సంతపేటలోని బహుళార్ద పశువైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జంతువులతో మానవునికి సహచర్యం ఎంతో ప్రాచీనమైనదన్నారు. ప్రతి మనిషి పౌష్టికాహార అవసరాలకు పశుపక్ష్యాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ఆధారపడి ఉన్నారన్నారు. మనుషులు, పశువుల సహచర్యంతో జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులని పిలుస్తారన్నారు. ఈ వ్యాధులు సుమారు 280 వరకు గుర్తించబడ్డాయని తెలిపారు. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారి 1885 జూలై 6వ తేదీ పిచ్చికుక్క కాటుకు గురైన బాలునికి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును విజయవంతంగా ఇచ్చినందున ఆ రోజు నుంచి ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు వైరల్‌కు సంబంధించి రేబిస్, మెదడు వాపు, అమ్మవారు (పాక్స్), బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, నిఫా, బ్యాక్టీరియల్ వ్యాధులైన ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాలో నెల్లోసిస్, లిస్టీరియోసిస్, క్షయ (టీబీ), పారాసైటెక్ వ్యాధులు, అమీబియాసిస్, బాలాంటిడియోసిస్, సార్బోసిస్టోసిస్, టీనియాసిస్, ట్రైకినెల్లోసిస్, ఆస్కారియాసిస్, స్కేబీస్ (గజ్జి), తామర, హైడాటిడోసిస్, ఆంకై లోస్టోమియోసిస్ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. రేబిస్ వ్యాధి పిచ్చికుక్కల కాటు ద్వారా వ్యాప్తిచెందే అతి భయంకరమైన వ్యాఽధి అని తెలిపారు. పెంపుడు కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలను ప్రతి సంవత్సరం వేయించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని 518 పెంపుడు కుక్కలను వాటి యజమానులు తీసుకొచ్చి రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. పోలీస్ జాగిలాలను కూడా వాటి సంరక్షకులు తీసుకొచ్చి వ్యాక్సిన్ చేయించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, మేయర్ సుజాత, పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.