
ఆదాయం దిగదుడుపు.. రైతు చావులే రెట్టింపు
ఒంగోలు టౌన్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడతామని చెప్పిన మోదీ మాటలన్నీ నీటిలో మూటలయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధ్వజమెత్తారు. మోదీ కార్పొరేట్ అనుకూల పాలనతో వ్యవసాయ రంగం మరింతగా సంక్షోభంలో కూరుకుపోయిందని, కనీస ఆదాయం కూడా లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని నిప్పులు చెరిగారు. కార్మికుల హక్కులు కాపాడాలని, రైతులకు గిట్టుబుటు ధరలు కల్పించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు కర్షకులు, కార్మికులు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంకణాల మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా తిప్పికొట్టేందుకు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 24 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్‌లుగా కుదించడం దుర్మార్గమన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారని, లేబర్ కోడ్‌ల వల్ల 8 గంటల పని దినాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే కాకుండా, ఉపాధి హామీ చట్టాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుదామన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరుమూసుకొని కూర్చోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు ఊసా వెంకటేశ్వర్లు, అన్నవరపు శేషారావు, కంకణాల వెంకటేశ్వర్లు, గడ్డం పిచ్చయ్య, గోగుల నారాయణ, ఉబ్బా వెంకటేశ్వర్లు, తలారి ఆదాం, జి.వందనం, ఎం.దాసు, టి.అంజిబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో సంక్షోభంలో వ్యవసాయం కార్మిక హక్కులు హరించేలా లేబర్ కోడ్‌లు దుర్మార్గం కార్మికులంతా ఏకంకండి.. సమ్మెకు కదిలిరండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల