
రైతుల మాట అబద్ధం.. కాదు పోలీసులదే తప్పు!
త్రిపురాంతకం: ఓ భూవివాదం పోలీసులు, రైతుల మధ్య మాటల మంటలు రేపింది. పోలీసులు అన్యాయం చేస్తున్నారని రైతులు ఓ వీడియోలో ఆరోపించగా.. అదంతా తప్పుడు ప్రచారమంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్‌లో సీఐ హసన్, ఎస్సై శివబసవరాజు విలేకర్లతో మాట్లాడారు. త్రిపురాంతకం మండలం దీవేపల్లి వద్ద తలెత్తిన భూ వివాదంలో ఇరువర్గాల వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉందన్నారు. రైతులు తమవని చెబుతున్న భూములు వేరే వ్యక్తులపై రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులకు తెలియజేశామన్నారు. ఈ భూ తగాదాపై కేసు నమోదు చేశామని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతుల వాదన ఇదీ..
రైతులు ఒక వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూములను అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని దివేపల్లికి చెందిన ఎస్.చెన్నయ్య, కొండయ్య, ఓబులు, నర్సమ్మ, దూపాడుకు చెందిన చెన్నయ్య, పుల్లయ్య, డేవిడ్ ఆరోపించారు. భూములు పోతే ఆత్మహత్యే శరణ్యమని పురుగు మందు బాటిళ్లతో హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ తెలియకుండా సర్వే నంబర్ 881లో తుమ్మలవాగు పోరంబోకు భూమి 7.70 ఎకరాలను రిటైర్డ్ ఉద్యోగి భార్య, కుమారుడు శివకుమార్‌పై అసైన్‌మెంట్ చేసుకున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై హక్కు కల్పించాలని కోరారు.