
ధర సన్నగిల్లి!
నిమ్మకు నల్లి..
ఐదెకరాల తోటను వదిలేశా
నేను ఐదు ఎకరాల్లో నిమ్మ తోట సాగు చేశా. ధర పడిపోవడంతో కాయలు కోయలేదు. కేజీ రెండు రూపాయలకు కూడా వ్యాపారులు తీసుకోవడం లేదు. కోత కూలి ఖర్చు కూడా రాదనే ఉద్దేశంతో చెట్ల మీదే కాయలు వదిలేశా. ఈ ఏడాది నిమ్మ రైతులు భారీగా నష్టపోయారు. నిమ్మ రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడు.
– మీనుగు కాశయ్యఅవులవారిపల్లి
కాయలు ఏరి రోడ్డున పోయిస్తున్నా
ఈ ఏడాది ఆది నుంచే నిమ్మకు ధర లేదు. తొలి కోత సమయంలో కేజీ రూ.50 పలికింది. కొన్నాళ్లకే పండు కాయలు కేజీ రూ.2, పచ్చి కాయలు కేజీ రూ.6కు మించి వ్యాపారులు కొనడం లేదు. కమీషన్ వ్యాపారులు తేవద్దని చెబుతుండటంతో తోటలో వదిలేసిన కాయలు రాలిపోతున్నాయి. అవి కుళ్లడంతో నల్లి తెగులు సోకి తోట మొత్తం దెబ్బతింటోంది. రాలిన కాయలు ఏరి రోడ్ల పక్కన పడేస్తున్నాం. నాణ్యమైన కాయలను కూడా వ్యాపారులు చెప్పిన ధరకు ఇవ్వక తప్పడం లేదు.
– గాయం రమణారెడ్డి, హాజీపురం
హనుమంతునిపాడు: లాభాలు ఆశించి సాగు చేసిన నిమ్మ తోటలు రైతన్నలకు నష్టాలను రుచి చూపుతున్నాయి. నిమ్మ ధరలు భారీగా పతనం కావడం, మరోవైపు తెగుళ్లు చుట్టుముట్టడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాస్తోకూస్తో లాభాలు గడించిన రైతులు ప్రస్తుత పరిస్థితులు తలుచుకుని కుమిలిపోతున్నారు. అధిక మొత్తంలో కౌలు చెల్లించి సాగు చేపట్టిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మద్దతు ధర లేక, కూలి ఖర్చులు భరించి కాయలను మార్కెట్‌కు తరలించలేక చెట్ల మీదనే వదిలేస్తున్న దుస్థితి. వ్యయప్రయాసలకోర్చి కాయలను మార్కెట్‌కు తరలించిన రైతులు.. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రోడ్ల పక్కన పడేస్తున్న దృశ్యాలు కనిగిరి, హనుమంతునిపాడు మండలాల్లో తరచూ కనిపిస్తున్నాయి.
జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం 2,874 హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. ఒక్క హనుమంతునిపాడు మండలంలోనే ముదురు, లేత తోటలు సుమారు 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. హనుమంతునిపాడు ప్రాంతంలో పండించిన నిమ్మకాయలు హైదరాబాద్, ముంబై, కలకత్తా, చైన్నె తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్రలో నిమ్మ దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. అదే సమయంలో వ్యాపారులు, దళారులు కుమ్మక్కవడంతో కేజీ నిమ్మకాయల ధర రూ.2 నుంచి రూ.3 కూడా పలకడం లేదు. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని నిమ్మ రైతులు కోరుతున్నారు.
కిలో ధర రూ.2
ప్రస్తుతం పండు నిమ్మ కాయలు కేజీ రూ.2 నుంచి రూ.3కు మించి పలకడం లేదు. కాయలు మార్కెట్‌కు తేవద్దని చెబుతున్న కమీషన్ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. పచ్చి కాయలు కేజీ రూ.6 నుంచి రూ.7కు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో కోత కూలి, ఆటోల బాడుగ కూడా రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం పండ్ల తోటల రైతులనూ పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆశలు నల్లిపేస్తోంది!
నిమ్మ ధరలు పతనం కావడంతో చెట్లమీద వదిలేసిన కాయలు పండి రాలిపోతున్నాయి. చెట్లపై, పాదుల్లోనే కుళ్లిపోతుండటంతో నల్లి తెగులు ప్రబలి తోటలు దారుణంగా దెబ్బతింటున్నాయి. వేరు కుళ్లు, పేనుబంక, మంగు, ఎండు తెగులు, వైరస్ సోకిన తోటలను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. తెగుళ్ల కారణంగా కాయల నాణ్యత దెబ్బతినడంతో ధర పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ అనంతరం భారీ పరిమాణంలో నాణ్యత లేని కాయలను రోడ్డు పక్కన పడుస్తున్నారు. ఇదిలా ఉండగా తెగుళ్ల నివారణ చర్యల గురించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. ఉద్యానశాఖ అధికారులు నిమ్మ తోటలవైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
పాతాళంలోకి పడిపోయిన నిమ్మ ధరలు కేజీ కాయలు రూ.2 నుంచి రూ.3 కాయలు వద్దని రైతులకు చెబుతున్న వ్యాపారులు నిమ్మ తోటలను దారుణంగా దెబ్బతీస్తున్న నల్లి తెగులు ఆకు, కాయ రాలిపోతుండటంతో రైతుల్లో ఆందోళన పత్తా లేని ఉద్యానశాఖ అధికారులు

ధర సన్నగిల్లి!

ధర సన్నగిల్లి!

ధర సన్నగిల్లి!

ధర సన్నగిల్లి!

ధర సన్నగిల్లి!