
విధి ‘ఆట’కు బాలుడు బలి
కురిచేడు: చెట్టుకొమ్మ విరిగిపడి ప్రమాదవశాత్తు ఒక బాలుడు మృతి చెంది, మరో విద్యార్థికి గాయాలైన సంఘటన మంగళవారం కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలె గ్రామ పంచాయతీ పరిధిలోని వీవై కాలనీలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కాలనీకి చెందిన బాలురు బొజ్జారిత్విక్, బొజ్జా మల్లికార్జున, బొజ్జా మహీందర్, మేకల లక్ష్మి నారాయణ మంగళవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వేపచెట్టు ఎక్కారు. చెట్టుకొమ్మ విరిగి కింద అసంపూర్తిగా నిర్మించిన ఇంటి గోడ పోర్టికోపై పడి అదికూడా కలిసి కిందపడ్డాయి. ఆ చెట్టుకొమ్మపై ఉన్న నలుగురు కిందపడిపోయారు. వారిలో బొజ్జా మహీందర్(13) పోర్టికో కాంక్రీట్ బీమ్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురిలో బొజ్జా రిత్విక్‌కు తలకు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. రిత్విక్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మిగతా వారు ఐదో తరగతి తరువాత విద్యాభ్యాసం మానేశారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రుడిని ద్విచక్ర వాహనంపై కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో వినుకొండ తరలించారు. మహిళా పోలీస్ కె.రజిత ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎం.శివ తన సిబ్బందితో కలిసి బాలుడి మృతదేహాన్ని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.
ఆడుకునేందుకు చెట్టు ఎక్కిన నలుగురు బాలురు కొమ్మ విరగడంతో ఒకరు మృతి, మరో విద్యార్థికి గాయాలు

విధి ‘ఆట’కు బాలుడు బలి

విధి ‘ఆట’కు బాలుడు బలి