
పోయిన నగలు పట్టించిన ఫోన్ పే!
యర్రగొండపాలెం: ఓ వ్యక్తి పోగొట్టుకున్న నగలను ఫోన్ పే సాయంతో పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నగలనుఎస్సై పి.చౌడయ్య మంగళవారం బాధితుడికి అందజేశారు. వివరాలు.. మండలంలోని అయ్యంబొట్లపల్లికి చెందిన పెద్దపోగు కోటయ్య మే 31వ తేదీన బ్యాంకులో రుణం తీసుకునేందుకు తన బంగారు ఆభరణాలు తీసుకుని యర్రగొండపాలెం వచ్చాడు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద షోడా తాగి బ్యాంకు వద్దకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక నగలు కనిపించలేదు. వెంటనే కోటయ్య షోడా బండి వద్దకు వెళ్లి విచారించగా.. మరి కొంత మంది వచ్చి షోడా తాగి వెళ్లారని, వారు ఫోన్‌పే చేశారని చెప్పాడు. షోడా బండి వ్యాపారి ఇచ్చిన సమాచారం ఆధారంగా కోటయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ రోజు షోడా తాగి ఫోన్ పే చేసిన ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను గుర్తించి అప్పగించిన ఎస్సైకి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.