
వేధింపుల బదిలీలు..!
నాగులుప్పలపాడు:
కూటమి ప్రభుత్వం, పాలకుల తీరుకు తాము ఏమాత్రం తీసిపోము అన్నట్లుగా జిల్లా పంచాయతీ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధించే విషయంలో కూటమి పాలకులు తానా అంటుంటే.. జిల్లా పంచాయతీ అధికారులు తందానా అంటున్నారు. బదిలీల పేరుతో పంచాయతీ కార్యదర్శులపై అధికారులు కక్ష సాధింపులకు పాల్పడటమే అందుకు నిదర్శనంగా ఉంది. పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులుగా ఉండి జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన కార్యదర్శులను అధికారులు టార్గెట్ చేశారు. నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని సుదూర ప్రాంతాలకు వారిని బదిలీ చేసి వేధిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి మరీ...
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీలకు సంబంధించిన నియమాలను పరిశీలిస్తే.. ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా వేరేచోటకు బదిలీ చేయాలి. లేకుంటే ఉద్యోగి పనిచేస్తున్న మండలం, అతని సొంత మండలం ఒకటే అయితే బదిలీ చేయాలి. కానీ, పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రస్తుతం జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్న తరహాలో పంచాయతీ అధికారులు కూడా తమ మాట వినని పంచాయతీ కార్యదర్శులపై బదిలీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. బదిలీలను తమకు అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా కార్యదర్శులను బదిలీ చేస్తున్నారు.
సంఘంలో పనిచేసిన వారే లక్ష్యంగా...
జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘంలో పనిచేసిన వారిపై మరింతగా అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అక్రమాలపై గొంతెత్తడంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో జరిగిన బదిలీల్లో జిల్లా పంచాయతీ కార్యాలయంలో తిష్ట వేసుకుని కూర్చుని బదిలీల్లో అవకతవకలకు పాల్పడి లక్షల్లో డబ్బు వసూలు చేసిన ఉద్యోగులపై కోర్టులకు వెళ్లడంతో సంబంధిత కార్యదర్శులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కురిచేడు, నాగులుప్పలపాడు, అద్దంకి, మార్కాపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 20 మంది పంచాయతీ కార్యదర్శులను ఆయా మండలాలు వారి సొంత మండలాలు కానప్పటికీ, ప్రస్తుతం వారు పనిచేస్తున్న మండలాలకు వచ్చి ఐదేళ్లు పూర్తికానప్పటికీ జిల్లా స్థాయి అధికారుల తప్పిదాలను ఎత్తి చూపడంతో పాటు గతంలో జరిగిన అడ్డగోలు బదిలీలు, పదోన్నతులు, అక్రమాలపై ఆధారాలతో కోర్టులకు వెళ్లారనే కారణంతో ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు బదిలీ చేసి వేధిస్తున్నారు. కోర్టు కేసులకు సంబంధించి కలెక్టర్‌తో పాటు జిల్లా పంచాయతీ అధికారి కూడా స్పందించాల్సి ఉండటాన్ని అవమానకరంగా భావించిన జిల్లా అధికారులు.. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆయా మండలాల నుంచి దూరంగా బదిలీ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
పంచాయతీ కార్యదర్శుల లాగిన్‌లు ఆపివేయడంతో ఖాళీగా కనిపిస్తున్న పంచాయతీ వివరాలు
బదిలీల పేరుతో పంచాయతీ కార్యదర్శులపై కక్ష సాధింపులు
సంఘ నాయకులుగా పనిచేస్తూ డీపీవోలో అక్రమాలపై ప్రశ్నించిన వారిపై వేధింపులు
నిబంధనలకు నీళ్లొదిలి సుదూర ప్రాంతాలకు పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు
కూటమి పాలనలో ప్రశ్నించిన వారిని హింసిస్తున్నారనడానికి మరో నిదర్శనం
బదిలీల్లో పారదర్శకత లేదు
పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో ఉన్నతాధికారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లో పనిచేయడానికి అర్హత ఉన్నప్పటికీ బలవంతంగా బదిలీలు చేపట్టడం చాలా బాధాకరం. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులకు కూడా వెళ్లాం. చట్టపరంగా తమకు న్యాయం జరిగేంత వరకు మా హక్కుల కోసం పోరాడతాం.
– మెరుగోలు బెన్‌హర్, పంచాయతీ
సెక్రటరీల సంఘ జిల్లా అధ్యక్షుడు
వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంపీడీఓలకు పంపించి...
టార్గెట్ చేసిన పంచాయతీ కార్యదర్శులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయాలనే ఆదేశాలను సంబంధిత మండలాల ఎంపీడీలకు వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించినట్లు సమాచారం. తాము చెప్పిన కార్యదర్శులను తక్షణమే ఆయా మండలాల నుంచి బదిలీ చేయాలని నేరుగా జిల్లా పంచాయతీ అధికారే రంగంలోకి దిగి ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లా పంచాయతీ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తాము ప్రశ్నించిన పాపానికి తమను బదిలీ చేసినట్లు చూపించి ప్రస్తుతం తాము పనిచేస్తున్న గ్రామ పంచాయతీలలో లాగిన్‌లు కూడా ఆపివేశారని సంబంధిత కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇంత అవినీతి జరిగిన విషయం ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా వారిపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారులపై జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని పలువురు కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే తమ విధులకు ఆటంకం కలిగిస్తూ లాగిన్‌లు ఆపడంతో పాటు తమకు ఆయా మండలాల్లో జీతాలు పెట్టొద్దని కూడా డీపీవో ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీవోల ద్వారా తెలుసుకున్న బాధిత పంచాయతీ కార్యదర్శులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేధింపుల బదిలీలు..!