
పారిశుధ్యంపై కేంద్ర బృందం తనిఖీలు
చీమకుర్తి రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ–2025 కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుండువారిలక్ష్మీపురం గ్రామంలో శనివారం కేంద్ర బృంద సభ్యులైన జి.రవివర్మ, పుదీర్, సందీప్ పర్యటించారు. పారిశుధ్యం నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్యం నిర్వహణపై సర్వే నిర్వహించి ఆయా పంచాయతీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టి.శాంతిప్రియ, ఖాజావలి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పురుగుమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
గిద్దలూరు రూరల్: పురుగుమందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని నల్లబండ బజారు శివారు మేకల నరవ ప్రాంతంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామానికి చెందిన నల్లబోతుల రంగయ్య (64) నాలుగు రోజుల క్రితం ఇంటి వద్ద తన పెద్ద కుమారుడితో ఘర్షణ పడి గిద్దలూరు వెళ్లాడు. అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా పడి ఉన్న రంగయ్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య గతంలోనే మరణించింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని
మృతదేహం గుర్తింపు
టంగుటూరు: గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండలంలోని వల్లూరు గ్రామ పొలాల్లో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరు జాతీయ రహదారి సమీప పొలాల్లో గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి 35 నుంచి 50 ఏళ్లు ఉండొచ్చు. ఒంటిపై బ్రౌన్ రంగు కలిగి ఉన్న ఫుల్ హాండ్స్ షర్ట్, నల్ల కాటన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. షర్ట్ కాలర్ వద్ద ఒంగోలులోని కమల్ టైలర్స్ లేబుల్ ఉంది. గుర్తుపట్టిన వెంటనే టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు 91211 02137 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
రైలు కిందపడి వృద్ధుడి దుర్మరణం
టంగుటూరు: ప్రమాదవశాత్తు రైలు కిందపడి వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జరుగుమల్లి గ్రామానికి చెందిన పిలిమి సుబ్బారెడ్డి (69) తన భార్య కమలమ్మతో కలిసి కావలిలో వైద్య చికిత్స కోసం బయల్దేరాడు. రైల్వేస్టేషన్లో రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫాం మారే ప్రయత్నం చేశారు. గూడ్స్ రైలు కింద నుంచి దూరి అవతలి ప్లాట్‌ఫాంకు వెళ్లే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా రైలు కదలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకు న్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చెరుకొని ప్రమాదానికి కారణాలు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

పారిశుధ్యంపై కేంద్ర బృందం తనిఖీలు