
కారు, ఆటో ఢీ
కొనకనమిట్ల: దైవ దర్శనానికి వెళ్తున్న కారు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారి మండలంలోని చినారికట్ల జంక్షన్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చెన్నయ్య తన ఆటోలో కాట్రగుంట, వెంగలపల్లి, గొట్లగట్టుకు చెందిన ప్రయాణిలను ఎక్కించుకుని పొదిలి వెళ్తున్నాడు. ఆటో చినారికట్ల జంక్షన్ సమీపంలోకి వచ్చే సరికి చీమకుర్తికి చెందిన శివ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు దగ్గర ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి గుడికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఆ క్రమంలో అదుపు తప్పిన కారు, ఆటో ఢీకొన్నాయి. ఆటో రోడ్డు మార్జిన్ పక్కన ఉన్న రాళ్ల గుట్టపై పడటంతో ఆటోలో ఉన్న కాట్రగుంట గ్రామానికి చెందిన మూడమంచు బాలయ్య (55) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాట్రగుంట పంచాయతీ వెంగళపల్లి గ్రామానికి చెందిన మోరా నారాయణమ్మ (55) తీవ్రంగా గాయపడగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అదే ఆటోలో ఉన్న నారాయణమ్మ భర్త ఆదినారాయణ కూడా గాయపడి పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆటో తోలుతున్న చెన్నయ్య తీవ్రంగా గాయపడి పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన బాలయ్యకు భార్య కొండమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతురాలు నారాయణమ్మకు భర్త ఆదినారాయణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మిగిలిన ప్రయాణికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్న వారు కూడా గాయపడగా వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం బాలయ్య, నారాయణమ్మ మృతదేహాలను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాట్రగుంట పంచాయతీలో కాట్రగుంట, వెంగళపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు దుర్మరణం
ఎనిమిది మందికి గాయాలు

కారు, ఆటో ఢీ