
కేంద్ర న్యాయశాఖలో కరవది విద్యార్థినికి ఇంటర్న్‌షిప్ అవ
ఒంగోలు సిటీ: ఒంగోలు మండలంలోని కరవది గ్రామానికి చెందిన సత్యాల అంజనప్రియకు కేంద్ర న్యాయశాఖలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం దక్కింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో 5వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న అంజనప్రియ భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం నిర్వహించిన జూలై–2025 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ఈ ఇంటర్న్‌షిప్ న్యాయమంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూఢిల్లీలో జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు. అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పనిచేసే అరుదైన అవకాశం వస్తుందని, అలాంటి అవకాశం కరవది విద్యార్థినికి రావడం విశేషమని పలువురు అభినందించారు.