
లో గ్రేడ్ పొగాకును రూ.20 వేలకు కొనుగోలు చేయాలి
ఒంగోలు టౌన్: పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అన్నీ రకాల లో గ్రేడ్ పొగాకును క్వింటాలుకు రూ.20 వేలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జజ్జూరి జయంతి బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు రేటు రోజురోజుకూ పడిపోతుందని చెప్పారు. మేలు రకం పొగాకు మాత్రమే కొంటామని చెబుతున్న కంపెనీలు లో గ్రేడ్ పొగాకును తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ సాకుతో తక్కువ రేటుకు కొనుగోలు చేయాలన్న కుట్రతోనే పొగాకును తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. దీని వలన బ్యార్నీకి రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు, ప్రభుత్వరంగ సంస్థలు వేలంలో పాల్గొని లో గ్రేడ్ పొగాకును రూ.20 వేల కు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్కే బాబు, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, ముప్పరాజు బ్రహ్మయ్య, నెల్లూరు నరసింహరావు, పిల్లి తిప్పారెడ్డి, ఊసన వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.