
న్యాయమైన సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లు, కోర్కెలను తీర్చకపోతే సామూహిక సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం అసోసియేషన్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు మధ్యాహ్న భోజన విరామ సమయం నుంచి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఒకలా ఉంటే జిల్లాలోని పంచాయతీ అధికారుల తీరు మరీ దారుణంగా ఉందంటూ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. డీపీఓకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం.బెన్‌హర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు పంచాయతీ కార్యదర్శులంతా ఉదయం 6 గంటలకే గ్రామ పంచాయతీలో దినపత్రికలు చేత పట్టుకొని ఫొటోలు దిగాలి అని చెప్పటం అత్యంత దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వడం లేదని, అధిక భాగం నివాసానికి దూరంగా 50 నుంచి 100 కిలో మీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలో అన్నిరకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్నుల వసూళ్లు, యాప్, గ్రామ సచివాలయ సర్వేలు, రెవెన్యూ పనులు, గ్రామసభలు, సమావేశాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు, ఇలా చాలా రకాల పనులు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే చేస్తున్నారని చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల ప్రాథమిక విధులైన పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు సక్రమంగా నిర్వహించేందుకు సరైన సిబ్బంది లేరని, తగిన వనరులు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులందరూ ఉద్యోగ నిర్వహణలో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు పారిశుధ్య కార్మికులను నియమించకుండా కేవలం రూ.6 వేల గ్రామ పంచాయతీల గ్రాంట్ నుంచి పారిశుధ్య కార్మికులకు చెల్లించాలనే ఆదేశాలు ఇచ్చారన్నారు. గ్రామాల్లో రూ.6 వేలకు చెత్త సేకరణ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. దీనివల్ల వారు పని భారం తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే సామూహిక సెలవులోకి వెళతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె.వెంకట్రావు, పి.నాగేశ్వరరావు, బి.మల్లిఖార్జున రావు, కే.జ్యోత్న, పరాశరం, విజయపాల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
లేకుంటే సామూహిక సెలవుకు వెనకాడం గ్రామాల్లో పనిచేయటానికి తగినంత సిబ్బందిని ఇవ్వాలి కలెక్టరేట్ ముందు పంచాయతీ కార్యదర్శుల ధర్నా