
వేలం బహిష్కరించిన రైతులు
కనిగిరిరూరల్: అన్ని రకాల పొగాకు బేళ్లను కొనుగోలు చేయాలని, మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని, నోబిడ్ లేకుండా తెచ్చిన బేళ్లన్నీ కొనుగోలు చేయాలని కోరుతూ శనివారం అలవలపాడు క్లస్టర్ పరిధిలోని రైతులు వేలం పాటను బహిష్కరించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే అలవలపాడు క్లస్టర్ పరిధిలోని సుమారు 6 గ్రామాల రైతులు 644 పొగాకు బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. కనిష్ట ధర కేజీ రూ.150 ఇస్తున్నారని, బేళ్లను తిప్పి పంపకుండా అన్ని రకాల బేళ్లను పూర్తిగా సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని వేలం ప్రారంభంలో అధికారులను, బయ్యర్లను రైతులు కోరారు. దానికి వారు సమ్మతించలేదు. దీంతో రైతులు వేలాన్ని బహిష్కరించి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి
ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకుండా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రైతుల వద్ద గ్రేడ్ వన్ రకం మాత్రమే కొని మిగతా వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డారు. బోర్డు సూపరింటెండెంట్ రైతుల పక్షాన లేకుండా వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీ శ్రీను, ప్రతాప్, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి పొగాకు బోర్డు వద్దబైఠాయించి నిరసన