
తాడేపల్లి: భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాస్తే సాక్షి చానల్ సహా ఇతర చానల్స్‌పై కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనడానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు.
ఈరోజు(సోమవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ చేత సాక్షి చానల్ మీద కేసు వేయించారు. సాక్షి చానల్, కొన్ని ప్రైవేట్ చాన్సల్స్‌ను బెదిరించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారు. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగింనేది వాస్తవం కొండవీటి వాగు సహజ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తే ఆగుతుందా?, అడ్డదిడ్డంగా తవ్వి కట్టలు వేయడం వల్ల కొండవీటి వాగు పొలాల మీద పడింది.
హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి. ఈ వాస్తవాలతో వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు. అమరావతిపై మాకు అసూయ లేదు. అమరావతిపై రూ. 52 వేల కోట్లు అప్పు చేశారు. అమరావతి రైతులకు చంద్రబాబు ఏమైనా సహాయం చేశాడా?, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు ఆయన మీదే కేసులు పెట్టాలి. రూ. 220 కోట్లతో కొండవీటి వాగుపై లిఫ్ట్ పెట్టారు.. అది నిరుపయోగం అయ్యింది’ అని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి నీట మునిగిన ఫోటోలను అంబటి ప్రదర్శించారు
ఇక మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఎమ్మెల్యే కూన రవి కుమార్, జూనియర్ ఎన్టీఆర్‌పై తప్పుడు మాటలు మాట్లాడిన మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌లపై చర్యలేవని ప్రశ్నిచాచు. వారిపై ఎందుకు కేసులు పెట్టరు.. ఎందుకు సస్పెండ్ చేయరని అంబటి నిలదీశారు.