
సాక్షి,అమరావతి: టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. ఈ నకిలీ మద్యం దందాపై సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
2024 ఎన్నికల మందు తంబెళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె,ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మద్యం దందాపై ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
టీడీపీ నేతలే నకిలీ మద్యం కేసులో దొరికారు. రాష్ట్రంలో డంపులు డంపులుగా నకిలీ మద్యం సీజ్ అవుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని అనేక చోట్ల తయారు చేస్తున్నారు.. నా నియోజకవర్గ పరిధి లో ఉన్న తంబాళపల్లిలో చిన్న పరిశ్రమనే స్టార్ట్ చేశారు. తంబళ్ళపల్లెలో టీడీపీ తరుపున పోటీ చేసిన వ్యక్తే పట్టుబడ్డాడు. జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి టీడీపీ మనిషి. ఇంత నిస్సిగ్గుగా మీ నాయకులే పట్టుబడితే.. మా మీద ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. వాళ్ళు మా కోవర్టులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ముగ్గురు, నలుగురు ఇప్పుడు కేబినెట్‌లో ఉన్నారు. కెబినెట్ మంత్రులు కూడా మా కోవర్టులే అవుతారా? దీనిపై నిజనిజాలు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర అధికారులతో విచారణ చేస్తే దర్యాప్తు తప్పుదోవ పడుతుంది. అందుకే సీబీఐతోనే నకిలీ లిక్కర్‌పై విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.