
కంపుకొడుతున్నాయి..
● ఓపెన్ ప్లాట్లు.. తప్పని పాట్లు
● అపరిశుభ్రతకు నిలయాలుగా ఖాళీ స్థలాలు
● జనావాసాల్లోనే వర్షపునీరు, డ్రైనేజీ నిల్వలు
● చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో వెలువడుతున్న దుర్గంధం
● పట్టించుకోని బల్దియా అధికార యంత్రాంగం
సాక్షి పెద్దపల్లి: రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటోంది. దీంతో మున్సిపాలిటీల్లో ఇళ్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, భవిష్యత్‌లో భూమి విలువ పెరుగుతుందన్న ఆశతో మరికొందరు విరివిగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఖాళీస్థలాలు బాగానే ఉండిపోతున్నాయి. కానీ, వాటి నిర్వహణపై యజమానులు పట్టనట్లు వ్యవహరించడంతో పిచ్చిమొక్కలతో నిండి, మురుగునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వీటిని శుభ్రం చేయాలని స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీస్థలాల్లో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారాయి. పిచ్చిమెక్కలు, చెట్లు, చెత్తాచెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. దుర్గంధం వెలువడడంతో స్థానికులు వ్యాధుల బారినపడుతున్నారు.
నోటీసులకే పరిమితం
నిబంధనల ప్రకారం ఓపెన్ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగు, వర్షపునీరు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థల యజమానులదే. కానీ, వారు పట్టించుకోవడంలేదు. చెత్త, మురుగునీరు చేరి ఓపెన్ ప్లాట్లు మురికికూపాలుగా మారుతున్నాయి. గత పట్టణ ప్రగతిలో వీటిని గుర్తించినా చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. కేవలం నోటీసులతోనే సరిపెట్టారు. కొందరు స్పందించినా.. చాలామంది తమకేం పట్టనట్లు వ్యహరిస్తున్నారు. అసలు ఖాళీప్లాట్లు ఎన్ని ఉన్నాయో కూడా యంత్రాంగం వద్ద సమాచారం లేదు.
ఆదేశాలు బేఖాతరు!
ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాల ని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే, కొత్తగా రి జిస్ట్రేషన్ చేసుకున్న వాటికే ఈ పన్ను వసూలు చే స్తున్నారు. వందల సంఖ్యలోని పాత ప్లాట్ల యజమానుల సమాచారం తెలియక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోంది. అయితే, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగమే ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాల్సి ఉంది. భవన నిర్మాణం, ఇతర అనుమతుల కోసం దరఖాస్తు చే సుకునే సమయంలో అధికారులు ప్లాట్లను చదును చేసేందుకు అయిన ఖర్చును వసూలు చేయాల్సి ఉంది. ఈవిషయంలో ఎన్ని ఓపెన్ ప్లాట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి? ఎంతమంది యజమానులకు నోటీసులు ఇచ్చారు? ఎన్ని ప్లాట్లను శుభ్రం చేయించారు? ఎంత జరిమానా విధించారు? అనే సమాచారం కోసం అధికారులను వివరణ కోరగా.. కొందరికే నోటీసులు జారీచేశామన్నారు. మరికొందరి చిరునామా తెలియదని సమాధానమిస్తున్నారు.

కంపుకొడుతున్నాయి..

కంపుకొడుతున్నాయి..