
నీటిగుంతలు.. అసంపూర్తి డివైడర్లు
● రహదారిపైనే సిమెంట్ వ్యర్థాలు ● కానరాని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ● రోడ్లపైనే పశువులు – తరచూ ప్రమాదాలు ● అస్తవ్యస్తంగా మేడిపల్లి – భరత్‌నగర్ మార్గం
జ్యోతినగర్(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తున్నా.. అందులో భాగమైన ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్డు సమస్యలకు నిలయంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్‌లోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మేడిపల్లి సెంటర్. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడంలేదు. గతేడాది గ్రీన్‌బెల్ట్ నిర్మాణం పేరిట సర్వీసు రోడ్డు సమీపంలోని కమర్షియల్ దుకాణాలను తొలగించారు. ఖాళీ స్థలాల్లో ఇప్పటివరకు పచ్చదనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీవల రోడ్డు విస్తరణ కోసం మరికొన్ని నిర్మాణాలు తొలగించారు. ఇంకా కొన్నింటికి మార్కింగ్ చేసి కూల్చివేశారు. వాటితాలూకు వ్యర్థాలను రోడ్డుపైనే వదిలివేశారు. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సెంట్రల్ లైటింగ్ పనుల్లోనూ జాప్యం..
మేడిపల్లి సెంటర్ నుంచి భరత్‌నగర్ బోర్డు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు మధ్యలో గుంతలు తవ్వి అలాగే వదిలివేశారు. పాత స్తంభాలను రోడ్డు మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా రాత్రివేళ వాహనదారులు వాటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతల వద్ద సూచికలు లేక స్థానికులు అందులోపడి గాయాలపాలవుతున్నారు. డివైడర్లు లేక రోడ్డు దాటేందుకు స్థానికులు సాహసించడంలేదు.
బురదమయంగా రోడ్డు..
మేడిపల్లి సెంటర్ నుంచి భరత్‌నగర్ బోర్డు వరకు రోడ్డు విస్తరణ కోసం అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించి వ్యర్థాలను అలాగే వదిలివేశారు. సిమెంట్ వ్యర్థాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డుపై బురదగుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి.
పశువుల సంచారంతో ఆందోళన
మేడిపల్లి రోడ్డు మధ్యలోనే పశువులు సంచరిస్తున్నాయి. రాత్రివేళ అక్కడే సేదదీరుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పశువులు కొట్లాడుకోవడంతో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రిస్తామని అధికారులు చెప్పినా ఇంకా అమలుకు నోచుకోవడం లేదు.

నీటిగుంతలు.. అసంపూర్తి డివైడర్లు

నీటిగుంతలు.. అసంపూర్తి డివైడర్లు

నీటిగుంతలు.. అసంపూర్తి డివైడర్లు