
మేము ‘ఆగం’
● జరిమానా చెల్లిస్తాం.. కానీ నిబంధనలు పాటించం ● ఇద్దరికి మించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ● మైనర్ల చేతిలో బండి.. రయ్ రయ్ మంటూ డ్రైవింగ్ ● అతివేగం, అజాగ్రత్తలతో పట్టు తప్పి ప్రమాదాలు
బైక్‌పై రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్తున్న మైనర్లు వీరు. జిల్లా కేంద్రంలో గత మంగళవారం పాలిసెట్ రాసి ఇళ్లకు వెళ్తున్నారు. అసలే వేసవి సెలవులు.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌చేసే సమయం.. ఇంట్లో ఉండలేని మైనర్లు పరిమితికి మించి ఇలా బైక్‌లపై రైడింగ్ చేస్తున్నారు. రోడ్లపై దూసుకుపోతున్నారు.
వాహనాలు ఇచ్చినవారిపై చర్యలు
మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం. వారికి వాహనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తరచూ వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం. నంబరు ప్లేట్లు, నంబర్లు తొలగించినా క్రిమినల్ కేసులు తప్పవు.
– జానీ నర్సింహులు, ట్రాఫిక్ ఏసీపీ
సాక్షి, పెద్దపల్లి: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. కేసులు నమోదైనా సరే.. అవసరమైతే ఫైన్ చెల్లిస్తామని, రూల్స్ మాత్రం పాటించేదిలేదన్నట్లు చాలామంది యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తమతోపాటు ఎదుటివారికి ప్రమాదమని తెలిసినా రయ్..రయ్‌మంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు.
అప్పుడు తనిఖీలు..
గతంలో పోలీసులు ప్రధాన కూడళ్లతోపాటు రహదారులపై నిత్యం తనిఖీలు చేసి జరిమానా విధించేవారు. ఈ చలానా పద్ధతి అందుబాటులోకి వచ్చాక ఉల్లంఘనలను కెమెరాలతో క్లిక్‌మనిపిస్తున్నారు. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అయినా, కొందరు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంనేందుకు అడ్డదారిలో వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు.
ఈ ఏడాది 101 ప్రమాదాలు..
జిల్లాలో ఈఏడాది 101 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని రికార్డులు చెబుతున్నాయి. అందు లో 39మంది మృతిచెందారు. 108మంది గాయాలపాలయ్యారు. జిల్లాలో ప్రధానంగా 26 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ చలానా, నేరుగా జరిమానా విధిస్తున్నారు గత జనవరి నుంచి ఇప్పటివరకు 1.45లక్షల కేసులు నమోదుకాగా, రూ.4.12కోట్ల వరకు జరిమానా విధించినా.. వాహనదారుల్లో మార్పు కానరావడం లేదు.
తప్పించుకునేలా ఎత్తులు
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిని పోలీసులు కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారు. దీంతో కొందరు నంబరు ప్లేట్‌లో అంకెలు కనిపించకుండా చేస్తున్నారు. కొన్నింటిపై రంగులు పూస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ఇలాంటివారే అధికంగా ఉంటున్నారు. ప్రమాదమని తెలిసినా.. ముందుకు వెళ్లి వాహనం వెనక్కి తిప్పుకొచ్చే అవకాశం ఉన్నా.. పట్టించుకోవడం లేదు. దర్జాగా వాహనాలకు ఎదురుగా వెళ్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
జైలు శిక్షలు ఉన్నా..
18 ఏళ్ల వయసు నిండిన తర్వాతే గేర్ వాహనాలు నడిపేందుకు అర్హులని అధికారులు చెబుతున్నారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేనివ్యక్తికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనలేని తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్‌లు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారు.
జిల్లాలో ఈఏడాది ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ 1,931
అతివేగం 6,731
ట్రిపుల్ రైడింగ్ 2,473
డ్రైవింగ్ లైసెన్స్ లేనివి 5,266
డ్రంక్ అండ్ డ్రైవ్ 3,813
సీట్‌బెల్ట్ ధరించనివి 138
మైనర్ రైడింగ్ 10
మొత్తం ట్రాఫిక్ కేసులు 1,45,673
జరిమానాలు(రూ.లలో) 4,12,99,615
జరిమానా చెల్లించినవారు 17,518
చెల్లించిన సొమ్ము(రూ.లలో) 50,00,035

మేము ‘ఆగం’

మేము ‘ఆగం’