
ప్రాణాలు కాపాడేదెలా?
సాక్షి, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉద్దేశించిన ట్రామాకేర్ కేంద్రాలు ప్రతిపాదనదశ వీడడం లేదు. కేంద్రప్రభుత్వం 2012లో ట్రామాకేర్ వైద్యసేవలు ప్రారంభించినా.. జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించి ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉండడంతో గాయపడినవారిని సమీపంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చాలా సందర్భాల్లో సత్వర వైద్య సేవలు అందక గాయపడినవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన తొలిగంట(గోల్డెన్ అవర్)లో సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తి బతికే అవకాశాలు ఉన్నాయి. తాజా గా రాష్ట్రప్రభుత్వం 90 వరకు ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.
ట్రామా వస్తే.. ఎంతోమేలు
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, రహదారులపై ప్రమాదాలు జరిగినా, ఇంట్లో జారీపడినా, భవనాలు కూలీ తీవ్రంగా గాయపడినా బాధితులకు సత్వరమే అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి ట్రామాకేర్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాధితుల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా రహదారుల చెంతనే వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్దేశించింది. ట్రామాకేర్ సెంటర్ల ద్వారా ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, అనెస్తీషియా, ఎంబీబీఎస్, ఎక్స్‌రే, అంబులెన్స్, డ్రైవర్, సహాయకులు మందులు, అత్యవసర ఆపరేషన్ ఽథియేటర్, ఐసీయూ తదితర అన్నిరకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా రెఫరల్ కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది.
చొరవ తీసుకుంటే
జిల్లాలో ట్రాామా సెంటర్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా డిమాండ్ వస్తోంది. జిల్లాలో ట్రామా సెంటర్ ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ చూపితే స్థానికంగా ఎంతోమందికి అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చి ప్రాణాలు దక్కుతాయి.
జిల్లాలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు
ప్రతిపాదనలు దాటని ట్రామాకేర్ సెంటర్
సత్వర వైద్యం అందక పోతున్న ప్రాణాలు
స్థానిక నేతలు చొరవ చూపాలని డిమాండ్
ప్రతిపాదన దశల్లోనే..
జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే అంశం ప్రతిపాదన దశలోనే ఉంది. ఇప్పటివరకు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదు. ప్రభత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. సెంటర్ ఏర్పాటు అయితే, రహదారి ప్రమాద బాధితులకు ఎంతో మేలు చేకూరుతుంది.
– శ్రీధర్, డీసీహెచ్‌వో

ప్రాణాలు కాపాడేదెలా?