
లగ్గం.. షరతుల పగ్గం!
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.
పట్టింపులతో సమస్య..
అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు.
భిన్నమైన పరిస్థితి
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు.
మానసిక సమస్యలు
పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు.