
ప్రతి గింజను కొంటాం
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో ధాన్యం కొట్టుకుపోయిందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం మార్కెట్‌యార్డును చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ చైర్మన్ జడల సురేందర్, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి తదితర నేతలతో సదర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం రంగుమారకుండా, గింజ విరగకుండా ఉండేందుకు వీలుగా ఉప్పు నీరు చల్లాలని రైతులకు సూచించారు. ఉప్పు తెప్పించి నీళ్లలో కలిపి చల్లించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో గింజ కోత లేకుండా కొనుగోలు చేస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రైతుల కోట్లాది రూపాయల శ్రమను దోచుకున్నారని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నరకం ధాన్యానికి రూ.500బోనస్ చెల్లించి అండగా నిలిచిందన్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, ఎడ్ల మహేందర్, ఉప్పురాజు, మసూద్ తదితరులున్నారు.