
కలెక్టర్ సంగీతకు ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీలో అధికారులు, పాలకులు కలిసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, తూముల సుభాష్‌రావు, బూతగడ్డ సంపత్, నాయకుడు తాడూరి శ్రీమాన్ శుక్రవారం కలెక్టర్ సంగీతకు ఫిర్యాదు చేశారు. పట్టణప్రగతిలో భాగంగా రూ.కోటి 12లక్షల జనరల్‌ఫండ్ నిధులను ఎజెండా 37 ద్వారా కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా మొక్కలకు ట్రీగార్‌ుడ్స పేరిట లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఎజెండాలోని 50వ అంశంలో చీకురాయి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు 15వ ఆర్థికసంఘం నిధులు రూ.80 లక్షల 56వేలు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టోన్‌వాటర్ డ్రైనేజీ పేరిట రూ.50 లక్షలతో తీర్మానించడం అన్యాయమన్నారు. గతంలో 14వ ఆర్థికసంఘ నిధులకు సంబంధించి రూ.1.68 కోట్ల పనులు ఎందుకు రద్దు చేశారో అంతుబట్టడం లేదన్నారు. మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.