విద్యార్థుల సన్నబియ్యం మింగుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సన్నబియ్యం మింగుతున్నారు!

Mar 31 2023 1:34 AM | Updated on Mar 31 2023 1:34 AM

సుల్తానాబాద్‌ మండలంలో తనిఖీలు చేస్త్తున్న విజిలెన్స్‌ అధికారులు
 - Sakshi

సుల్తానాబాద్‌ మండలంలో తనిఖీలు చేస్త్తున్న విజిలెన్స్‌ అధికారులు

● ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు ● ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పక్కదారి పడుతున్న బియ్యం ● గోదాం ఇన్‌చార్జీలు, సిబ్బందే ప్రధాన సూత్రధారులు ● విజిలెన్స్‌ తనిఖీలతో వెలుగులోకి అక్రమాలు ● రాష్ట్రవ్యాప్త తనిఖీలకు ఐదు ప్రత్యేక బృందాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి జిల్లాలో రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ, సంక్షేమ హాస్టళ్లకు చేరాల్సిన సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. సివిల్‌ సప్లయ్స్‌ అధికారులే రైస్‌ మిల్లర్లతో కుమ్మకై ్క వారికి ఈ బియ్యాన్ని దొడ్డిదారిన పంపిస్తున్నారన్న ప్రచారం ఉంది. తాజాగా పెద్దపల్లిలో జరిగిన విజిలెన్స్‌ తనిఖీలలోనూ సన్నబియ్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం రావడంతో ప్రచారానికి బలం చేకూరుతోంది. ప్రజాపంపిణీ బియ్యం నిల్వచేసే మండలస్థాయి కేంద్రాలు (ఎంఎల్‌ఎస్‌)ల ద్వారా రేషన్‌షాపులు, స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీలకు వెళ్లే 50 కిలోల సన్నబియ్యం బస్తా రేషన్‌ షాపునకు వచ్చేసరికి 2 నుంచి 4 కిలోలు తక్కువ కావడానికి కారణం పౌరసరఫరాలశాఖ అధికారుల చేతివాటమేనని సాక్షాత్తూ రేషన్‌డీలర్లే ఆరోపిస్తున్నారు.

నిర్వహణ ఇలా జరగాలి

రాష్ట్రస్థాయి గిడ్డంగులు, ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన పీడీఎస్‌ బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరుకోగానే, తూకం వేసిన తర్వాత తిరిగి డీలర్లకు పంపే ముందు మరోసారి తూకం వేయాలి. కానీ ఉమ్మడి జిల్లాలోని చాలాచోట్ల ఈ నిబంధన పాటించటం లేదు. రెండుసార్లు తూకం వేసినందుకు హమాలీలకు కూలీ కింద క్వింటాలుకు రూ.26 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం తరలించే వాహనానికి జీపీఎస్‌ సిస్టమ్‌ అనుసంధానించి ట్రాక్‌చేయాలి. గోదాం బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను నెలనెలా బియ్యం నిల్వలపై ఆన్‌లైన్‌లో వివరాలు నమోదుచేయాలి.

జరుగుతోందిలా

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం రాగానే వాటిని లారీల్లో నుంచి కిందకి దింపకుండా డీలర్లకు సరఫరా చేసే లారీల్లో నేరుగా లోడ్‌ చేస్తున్నారు. దీంతో చాలా సందర్భాల్లో 50 కిలోల చొప్పున ఉండాల్సిన బస్తాకు 46 నుంచి 50 కిలోలు వస్తోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఎలుకలు తినటం, ఇతర కారణాలు చూపుతూ నష్టం వచ్చిందని అక్రమాలకు తెరతీస్తున్నారు. మిల్లర్ల నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు రికార్డులు సృష్టిస్తూ, తరుగు పేరుతో తీసిన బియ్యాన్ని ఆ కోటాలో భర్తీ చేస్తున్నట్లు సమాచారం. జీపీఎస్‌ ట్రాక్‌ చేయకుండానే నేరుగా గోదాముల నుంచి బియ్యం లారీలను కొన్ని మిల్లర్లకు తరలిస్తూ రేషన్‌ రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సన్నబియ్యంను రేషన్‌ దుకాణాలకు సరఫరా చేయకుండా వాటిని బహిరంగ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ దందాలో ప్రధానంగా గోదాములను పర్యవేక్షించాల్సిన డీటీలు, ఇతర సిబ్బంది కొందరు మిల్లర్లు, రేషన్‌ డీలర్లతో కుమ్మకై ఈతంతు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మంగళవారం సుల్తానాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టగా సుమారు 725 క్వింటాళ్లు రేషన్‌ బియ్యం నిల్వలు తేడా ఉన్నట్లు తేలింది.

రాష్ట్రవ్యాప్తంగా ఐదు తనిఖీ బృందాలు..

పౌరసరఫరాల శాఖలో పనిచేసే అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వానికి ఇటీవలి కాలంలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇలాంటి అధికారుల అక్రమాలకు, రైస్‌మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్‌ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. వీరంతా ఫిర్యాదులు అధికంగా వచ్చే జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి నుంచి ఫిర్యాదుల నేపథ్యంలోనే మంగళవారం దాడులు నిర్వహించడంలో అక్రమాలు వెలుగుచూశాయి.

వివరాలు కరీంనగర్‌ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు 4 3 5 2

రేషన్‌షాపులు 487 413 592 345

నెల కోటా (మె.టన్నుల్లో) 4,000 2,303 5,602 3,300

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement