గోదాముల్లో గోల్‌మాల్‌..! | - | Sakshi
Sakshi News home page

గోదాముల్లో గోల్‌మాల్‌..!

Mar 30 2023 12:22 AM | Updated on Mar 30 2023 12:22 AM

- - Sakshi

● పక్కదారి పడుతున్న సబ్సిడీ బియ్యం ● లారీలనే మాయం చేస్తున్న వైనం ● గోదాం నుంచి మిల్లుకు.. మిల్లు నుంచి గోదాంకు ● అంతా అధికారుల కనుసన్నల్లోనే..? ● గాలింపు చర్యలకు మూడు టీంలు

సుల్తానాబాద్‌: జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం సరఫరాకు మూడు గోదాములున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా 6,27,841 క్వింటాళ్ల బియ్యం రేషన్‌షాపులకు పంపిణీ చేస్తారు. డీలర్లు తమ కోటాకు అనుగుణంగా డీడీలు చెల్లించి ప్రతినెలా 18లోగా మండల రెవెన్యూ కార్యాలయంలో అందిస్తే వారు ఆర్‌ఓలు జారీ చేస్తారు. అయితే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉచితంగా బియ్యం అందిస్తుండడంతో డీడీలు చెల్లించడం లేదు. అప్పటినుంచే బియ్యం పంపిణీ జిల్లాలో పక్కదారి పడుతోంది. గోదాములకు చేరాల్సిన లారీలనే కొందరు అక్కమార్కులు దారిమళ్లిస్తూ బియ్యం మాయం చేస్తున్నారు. సోమవారం రాత్రి గోదాముకు చేరాల్సిన లారీలు ఏకంగా రైస్‌మిల్లులకు చేరాయి. సివిల్‌ సప్లై, విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేసి ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

పక్కదారి పడుతోందిలా..!

వాస్తవానికి గోదాం నుంచి రేషన్‌ సరుకులను వేబ్రిడ్జిపై తూకం వేసి ఇస్తారు. అయితే జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఎక్కడా వేబ్రిడ్జిలు లేవు. కేవలం చిన్నపాటి తూకాలు మాత్రమే ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 50 కిలోల చొప్పున బియ్యాన్ని సంచుల్లో నింపి డీలర్లకు సరఫరా చేస్తున్నారు.

రెండు లారీల బియ్యం మాయం

సుల్తానాబాద్‌ మండలంలోని సుద్దాల స్టేజ్‌ వన్‌ గోదాం నుంచి, పౌర సరఫరాల శాఖ ఇక్కడి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సోమవారం ఐదు లారీల్లో బియ్యం లోడ్‌ పంపించింది. ఇందులో 420 బస్తాల చొప్పున ఉన్న మూడు లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. వాటిని పలు రేషన్‌షాప్‌లకు సరఫరా చేశారు. అయితే 450 బస్తాలున్న ఒక లారీ, 495 బస్తాలు (225 క్వింటాళ్లు)న్న మరో లారీ, 495 బస్తాలున్న (247.50 క్వింటాళ్లు) ఇంకో లారీని దారి మళ్లించారు. ఆ బియ్యాన్ని ఏకంగా ఓ రైస్‌మిల్లులో ఆన్‌లోడ్‌ చేసినట్లు అనుమానంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. వీటితోపాటు ఎఫ్‌ఆర్‌కె బియ్యం 29.55క్వింటాళ్లు, బీపీటీ 10.96క్వింటాళ్లు గోదాము నుంచి మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

గుర్తించేందుకు మూడు టీంలు

సుల్తానాబాద్‌లో మాయమైన లారీలతోపాటు బియ్యం గుర్తించేందుకు విజిలెన్స్‌ ఎస్పీ రామారావు ఆధ్వర్యంలో మూడు టీంలను ఏర్పాటు చేశారు. పట్టణంతోపాటు మండలంలోని పలు రైస్‌ మిల్లులను విజిలెన్స్‌ సీఐలు అనిల్‌ అరుణ్‌ ప్రసాద్‌, ఎస్సై నారాయణబాబు తనిఖీ చేశారు. తాత్కాలిక ఉద్యోగి శ్రీనివాస్‌ రెడ్డి సొంత గ్రామమైన జమ్మికుంట మండలం కల్లెపల్లెకు వెళ్లి విచా రించారు. లారీలతోపాటు డ్రైవర్లను తాత్కాలిక పద్ధతిపై నియమించుకుని డాటా ఎంట్రీ ఆపరేట ర్‌ శ్రీనివాస్‌ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. గోదాం ఇన్‌చార్జి వెంకటరాజాంకు సంబంధం లే కుండానే బియ్యం మాయమైనట్లు చెబుతున్నారు.

స్టాక్‌లోనూ తేడా..?

కొన్నిచోట్ల రేషన్‌ డీలర్లు ప్రతినెలా మొదటివారంలో ఇవ్వాల్సిన బియ్యాన్ని 20నుంచి అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అది కూడా రెండు, మూడు రోజులకోసారి ఇస్తుండటంతో 20 శాతం పంపిణీ చేయకముందే మరో నెల కోటా వస్తోంది. ఇలా ఒకనెల బియ్యం.. మరో నెలలో కలుపుతూ ఏడాదికి ఎంతలేదన్నా రెండు, మూడు కోటాల బియ్యాన్ని మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సుల్తానాబాద్‌ గోదాములో స్టాక్‌ నిల్వల్లో తేడా రావడమే ఇందుకు నిదర్శనమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆర్‌ఓలే మారుతాయ్‌

బియ్యం కుంభకోణం పకడ్బందీ ప్రణాళికతో.. హైటెక్‌ తరహాలో సాగుతుందన్న ఆరోపణలున్నాయి. మండలస్థాయి స్టాక్‌ పాయింట్లలో వివిధ మార్గాల ద్వారా ప్రతినెలా ఎన్ని బియ్యం మిగులుతాయనే విషయం సంబంధిత గోదాం ఇన్‌చార్జికి అవగాహన ఉంటుంది. అంతే పరిమాణంలో రేషన్‌ బియ్యాన్ని స్టేజ్‌–1 గోదాం నుంచి స్టేజ్‌–2 గోదాంకు తీసుకురాకుండానే ఆర్‌ఓలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటారని ఆరోపణలున్నాయి. బియ్యం అక్రమంగా దారి మళ్లించడం, రవాణా అంతా కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా దారిమళ్లిన రెండు లారీల వెంట రూట్‌ ఆఫీసర్‌ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై డీఎస్‌ఓ వెంకటేష్‌ వివరణ కోరగా పూర్తిస్థాయి నివేదికను ఆదనపు కలెక్టర్‌కు అందించామని, తెలిపారు. రెండు లారీల బియ్యం దారి మళ్లిన విషయమై డాటా ఎంట్రీ ఆపరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డిపై, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ లారీల రవాణా చేసే కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కలెక్టర్‌ సంగీత ఆదేశించారని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. గోదాం తాత్కాలిక ఇన్‌చార్జి వెంకటరాజంను సస్పెండ్‌ చేశామని తెలిపారు.

సుల్తానాబాద్‌లో మూసివేసి ఉన్న గోదాం

మంగళవారం ట్రక్‌ షీట్లు చించి వేయగా.. వాటిని అంటిస్తున్న అధికారులు

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement