అమాత్యా... ఇదేమి తీరు..!
సాలూరు: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఎస్ సంఘటన చాలా బాధాకరమని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పీఎస్ వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని, సాక్షి దినపత్రికను, తనను విమర్శిస్తూ నిందను మాపై నెట్టి బురదజల్లే విధంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడారని ఇది సరికాదని అన్నారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే తాను ఏనాడు కుటుంబాల జోలికి వచ్చి రాజకీయాలు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న వారు తప్పులు, పొరపాట్లు చేసి వాటిని ప్రతిపక్షంలో ఉన్న తమపై నెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టణంలో తన స్వగృహం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భర్త లేని బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై మంత్రి వద్దకు వెళ్లానని చెబుతున్నారని, అప్పుడే మంత్రి స్పందించి ఉంటే నేడు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. బాధిత మహిళ, సతీష్ ఇరువురు పరస్పర ఫిర్యాదులు పోలీస్‌స్టేషన్‌లో చేసుకున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ఇప్పటికే బాధిత మహిళ హైకోర్టుకు వెళ్లారని అవసరమైతే న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించే అవకాశం ఉంటుందన్నారు. తాను కుటుంబ బాంధవ్యాలకు విలువ ఇచ్చే వాడినని, కుటుంబాల విషయాల్లో రాజకీయాలు ఏనాడు చేయలేదని పునరుద్ఘాటించారు. తాను ఏనాడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని మానవత్వంతోనే రాజకీయాలు చేశానని చెప్పారు. తనను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి సంధ్యారాణి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, అటువంటిది ప్రతిపక్షంలో ఉన్న తాము అధికారంలో ఉన్న వారిని ఎలా ఇబ్బంది పెట్టగలమని ప్రశ్నించారు. బాధిత మహిళ తనకు అన్యాయం జరిగిందని సాక్షి టీవీకి తెలిపిన తరువాత ఆ మహిళ అదే విషయాన్ని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అన్ని మీడియా చానళ్లకు కూడా విషయం చెప్పారన్నారు. మంత్రి పీఏ, బాధిత మహిళ విషయంలో తమకు, వైఎస్సార్‌సీపీకి, సాక్షి దినపత్రికకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రినైన తనపై టీడీపీ శ్రేణులు, నేతలు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, పోస్టింగ్‌లు పెడుతున్నారని, వాటిని భద్రపరుస్తున్నానని పోలీస్‌స్టేషన్‌లో, సైబర్ క్రైమ్‌కు సమయం చూసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇందులో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి..
సాలూరు నియోజకవర్గ వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్ తెలుసుకోవాలని సూచించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఏ ఒక్కరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని, తమను ఎంత దారుణంగా విమర్శిస్తుంటారో ప్రజలకు తెలుసునని, ప్రజలు ఆమె వ్యవహార శైలిని గమనిస్తున్నారన్నారు. మంత్రి పీఎస్ వ్యవహారంలో తాను ఇప్పటి వరకు స్పందించలేదని, కానీ మంత్రి సంధ్యారాణి తనను, వైఎస్సార్‌సీపీని ఉద్దేశిస్తూ మాట్లాడడం వల్లే స్పందించానని చెప్పారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
మంత్రి పీఎస్ వ్యవహారంపై మాపై బురద చల్లడం సరికాదు
సమస్య వచ్చినప్పుడే పరిష్కరించి ఉంటే ఇలా జరిగేది కాదు..
మంత్రి సంధ్యారాణి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు..
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
అమాత్యా... ఇదేమి తీరు..!


