కనిపించని కాటు.. తీరని చేటు!
ప్రభుత్వం దృష్టి సారించాలి..
ట్రాంబోక్యులిడ్ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనిని చిగ్గర్ అని కూడా అంటారు. ఓరియెన్షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా దీనికి కారణం. ముఖ్యంగా పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరిగే రైతులు, కూలీలకు ఇది సోకే ప్రమాదం ఎక్కువ. అన్ని వయసుల వారికీ ఇది సోకే అవకాశముంది. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు త్వరగా ప్రభావితం అవుతారు.
పార్వతీపురం రూరల్: జిల్లాల్లో మారుతున్న వాతావరణం, పచ్చని పొలాల మాటున కంటికి కనిపించని ప్రమాదం పొంచి ఉంది. అదే స్క్రబ్ టైఫస్ వైరస్. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులను గత కొద్ది నెలలుగా ఈ వ్యాధి కలవరపెడుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. సాదాసీదా జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఊపిరితిత్తులపై పంజా విసురుతుంది. అందుకే దీనిపై సంపూర్ణ అవగాహన, తక్షణ వైద్యమే మనకు శ్రీరామరక్ష.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 17 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో 487 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా తేలింది. ఇక మన్యం జిల్లా (పార్వతీపురం) పరిధిలో 27 నమూనాల్లో 6 కేసులు బయటపడ్డాయి. ఇటీవల మెట్టపల్లికి చెందిన ఓ మహిళ ఈ లక్షణాలతో మృతి చెందడం విచారకరం. అయితే, ప్రస్తుతం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం ఊరటనిచ్చే అంశం. స్క్రబ్ టైఫస్ సోకినప్పుడు మొదట సాధారణ వైరల్ జ్వరంలాగే అనిపిస్తుంది. వైద్యుల దగ్గరకు వెళ్తే మందులు ఇస్తారు. జ్వరం తగ్గినట్టే తగ్గి, లోలోపల ఈ బ్యాక్టీరియా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
ప్రధాన లక్షణం
కీటకం కుట్టిన చోట చర్మంపై సిగరెట్ కాలిన గాయం లాంటి మచ్చ ఏర్పడుతుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం, దగ్గు ఉంటాయి. సకాలంలో గుర్తించకపోతే కిడ్నీలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
జాగ్రత్తలే మన ఆయుధాలు
పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో గడ్డి, పొదలు లేకుండా చూసుకోవాలి. ఎలుకల ద్వారా కూడా ఈ కీటకాలు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, ఎలుకల నివారణ ముఖ్యం. పొలాల నుంచి రాగానే వేడి నీటితో స్నానం చేయడం, బట్టలు ఉతకడం మంచిది. తీవ్రమైన జ్వరం వచ్చి, చర్మంపై నల్లని మచ్చ కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. సొంత వైద్యం అసలు చేయకూడదు.
ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ యాక్టివ్ కేసులు ఏమీ లేవు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కాదు. గాలి ద్వారా వ్యాపించదు. కేవలం పొదలు, తుప్పల్లో ఉండే మైట్ అనే సూక్ష్మ కీటకం కుట్టడం ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రజలు అనవసర భయాలకు లోనుకావద్దు. వ్యాధి సోకిన ప్రాథమిక దశలోనే గుర్తిస్తే యాంటీ బయాటిక్ మందులతో సులభంగా నయం చేయవచ్చు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో దీనికి సంబంధించిన మందులను తగినంతగా అందుబాటులో ఉంచాం. జ్వరం వస్తే కాలయాపన చేయకుండా, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి.
– డా.ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్‌వో,
పార్వతీపురం మన్యం
పచ్చని పొదల్లో.. ప్రాణ గండం!
అశ్రద్ధ చేస్తే.. ఆయువుకే ఎసరు!
జ్వరమే కదా అని జారవిడిస్తే.. ప్రాణాలకే ముప్పు!
సాధారణ జ్వరం కాదు.. ‘స్క్రబ్’ కాటు కావొచ్చు!
చిగ్గర్ కాటుతో చిక్కులు.. పెరుగుతున్న కేసులు
11 నెలల్లో 65 కేసులు.. ‘స్క్రబ్’ విషయంలో నిర్లక్ష్యం వద్దు!
వ్యాధి నివారణలో ప్రభుత్వ పాత్ర కీలకం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అనుమానిత లక్షణాలు ఉన్నవారి నమూనాలను బయట ల్యాబ్‌లను సంప్రదించాల్సి వస్తోంది. చాలామంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ లెక్కలు అధికారిక గణాంకాల్లోకి రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేసేందుకు కావల్సిన కిట్లును అందుబాటులోకి తేవాలి. మారుమూల గ్రామాల్లో ఈ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలి.
కనిపించని కాటు.. తీరని చేటు!


