మీకోసం వెబ్ సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్‌పైట్‌లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు.
జంఝావతి సాధన సమితి సమరభేరి
పార్వతీపురం రూరల్: జంఝావతి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణమే లక్ష్యంగా జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆయకట్టు గ్రామాల్లో సమితి నాయకులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు నేతృత్వంలో పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి, నిడగల్లు, పులిగుమ్మి, లచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో పర్యటించి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా 75 గ్రామాల్లో పర్యటించినట్టు తెలిపారు. ప్రతీ రైతు ఓ సైనికుడిలా కదిలి రావాలని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ విశ్రమించమని స్పష్టం చేశారు. త్వరలోనే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ సాక్షిగా నిరవధిక దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పల్లి రాజగోపాల్, మాలతి కృష్ణమూర్తినాయుడు, వంగల దాలినాయుడు, మండల పకీరు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో స్పందించి పరిష్కరించకుంటే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి నాగభూషణ్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల దగ్గరి కి యువగళం పాదయాత్ర ద్వారా వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారని, ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీలకు నిధులు తెస్తామంటూ చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే విద్యార్థి ఉద్యమం గుణపాఠం నేర్పిస్తుందని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం నిర్మిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్శి గౌరీ శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: అండర్ – 12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో మంగళవారం ఉదయం 7 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2013 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు తెలు
పు దుస్తులు ధరించి రావాలని సూచించారు.
మీకోసం వెబ్ సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల నమోదు


