మన్యంలో కందికి ప్రోత్సాహమేదీ!
● విస్తరిస్తే జిల్లాకు తీరనున్న కంది కొరత
● మార్కెటింగ్ సదుపాయాల్లేక తగ్గుతున్న సాగు
● వెలుగు మార్కెటింగ్ నిల్
సీతంపేట: మన్యంలో కంది పప్పుకు మార్కెట్ విస్తృతంగా ఉంది. ఇంటి అవసరాలకు కందిపప్పు తప్పనిసరి. అయితే కొద్ది నెలల కిందట కంది పప్పు కిలో ధర రూ.200లకు పైగా విక్రయించబడింది. గత ఆరు నెలలుగా రేషన్ డిపోల్లో కందిపప్పు లబ్ధిదారులకు ఇవ్వడం నిలిపివేశారు. అవసరమైన కందిపప్పు లేదు. కందిపప్పు కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.140పైనే కిలో కందిపప్పు విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో పండే కందిని ప్రోత్సాహిస్తే జిల్లాకు సరిపడే నాణ్యమైన కందిపప్పును అందించవచ్చని రైతులు చెబుతున్నారు. గతంలో ఐటీడీఏ పరిధిలో వివిధ మండలాల్లో కంది పంట విస్తారంగా పండేది. సీతంపేట ఏజెన్సీలో రైతులు ఎక్కువగా ఈ పంట పండించే వారు. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మరీ వెనుకబడిపోతుంది. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం, హిరమండలం మండలాలు టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానటెరింగ్ యూనిట్) మండలాలుగా ఉన్నాయి. ఈ పరిధిలో దాదాపు 200ల ఎకరాల వరకు కంది పండుతుంది. అయితే సీతంపేట ఏజెన్సీలో 50 ఎకరాల వరకు పండుతుంది. హెక్టార్‌కు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు కంది దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. 180 రోజులకు ఈ పంట ఖరీఫ్ సీజన్‌లో పండుతుంది. వరితో పాటు మెట్ట భూముల్లో, జీడిలో అంతర్ పంటగా వేసినా జిల్లాకు సరిపడా కందిని ఏజెన్సీలోనే పండించుకోవచ్చని నిపుణుల అభిప్రాయం.
కొనుగోలు చేసి నిలిపేశారు..
గతంలో ఏజెన్సీలో పండే కందిని వెలుగు ద్వారా కొనుగోలు చేసి కందిపప్పుగా తయారు చేసి ఇతర జిల్లాలకు సైతం విక్రయించేవారు. అంతలోనే మళ్లీ ఆ ప్రోసెస్‌కు అధికారులు మంగళం పాడేశారు. అటు తరువాత ఈ పంటపై మొగ్గు చూపని పరిస్థితి ఉంది. సీతంపేట ఏజెన్సీలోని నారాయణగూడ, మెట్టుగూడ, కుడ్డపల్లి, కడగండి, కుశిమి, పొల్ల, దోనుబాయి, మర్రిపాడు, గొయిది తదితర పంచాయతీల పరిధిలో కంది పండుతుంది. కొండపోడు పంటల్లో భాగంగా రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తారు.


