చెరకు తూనిక కేంద్రాలు సిద్ధం
● డిసెంబర్ 5న క్రషింగ్
● తగ్గిన ఉత్పత్తి
పండించిన చెరకు అంతా క్రషింగ్
జిల్లాలో 2025–26 క్రషింగ్ సీజన్‌కు ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్, భీమసింగి, ఎన్‌సీఎస్,గోవాడ సుగర్ ప్యాక్టరీల పరిధిలో చెరకు ఉత్పత్తి చేసిన 2.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఓవర్ హాలింగ్ చేసినట్లు యాజమాన్యం కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఉన్న చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు క్రషింగ్‌కు పూర్తిస్థాయిలో ఈఐడీ ప్యారీస్ యాజమాన్యం సిద్ధం చేసింది.
– ఎం.సత్యనారాయణ,
సుగర్‌కేన్ డిప్యూటీ కమిషనర్, బొబ్బిలి
సీతానగరం: సంకిలి ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో 2025–26 క్రషింగ్ ప్రారంభించడానికి యాజమాన్యం సిద్ధం చేయడంతో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు తరలించడానికి రహదారులు సక్రమంగాలేక మల్లగుల్లాలు పడుతున్నారు. సంకిలి ఈఐడీ ప్యారీస్ ప్రైవేట్ చక్కెర కర్మాగారం ఓవర్‌హాలింగ్ చేసి డిసెంబర్ 5న క్రషింగ్ చేయడానికి యాజమాన్యం సిద్ధం చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎనన్‌్ సీఎస్, భీమసింగి,సంకిలిలో ఈఐడీ ప్యారీస్ చెరకు కర్మాగారాలు ఉన్నాయి. పేరుకే మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లచ్చయ్యపేట ఎన్‌సీస్ కర్మాగారాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విజయనగరం ఎన్‌సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు విక్రయించారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి రైతులు వాణిజ్య పరంగా చెరకుపంటసాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్‌సీఎస్ కర్మాగారం పరిధిలోఉన్న 16 మండలాల్లో వేలాదిమంది రైతులు 5లక్షల నుంచి 6 లక్షల టన్నుల చెరకు ఉత్పతి చేసేవారు. కర్మాగారం మూతపడడంతో చెరకు విస్తీర్ణం తగ్గడం, ఉన్న చెరకును సంకిలి ఈఐడీ ప్యారీస్‌కు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కర్మాగారం పరిధిలో ఉన్న గ్రామాల్లో 2025–26 క్రషింగ్ సీజన్‌కు సుమారు 2.9లక్షల టన్నులచెరకు ఉత్పత్తి చేసినట్లు గణాంకాల ద్వారా తెలియవచ్చింది. అలాగే భీమసింగి కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 20 వేలు, గోవాడ కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 40 వేల టన్నుల చెరకు ఉత్పత్తి చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలియవచ్చింది.ఈ క్రమంలో ఈఐడీప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారం యాజమాన్యం 2 లక్షల 50 వేల టన్నులు క్రషింగ్ చేయడానికి వీలుగా ఓవర్ హాలింగ్ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చెరకు ఉత్పత్తి 3.5 లక్షల టన్నుల వరకూ ఉంది. అ మేరకు తెర్లాం, బాడంగి, సీతానగరం, కొమరాడ,బలిజిపేట, వంగర మండలాల్లో బెల్లం క్రషర్లు బెల్లం తయారు చేయడానికి గానుగలను చిన్నరైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. టన్ను చెరకు రూ. 3,200గా సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ధారించగా బెల్లం క్రషర్ యాజమాన్యాలు చెరకు టన్నుకు రూ.2800కు మించి కొనుగోలు చేయలేమని చెప్పడంతో చెరకు పండించే రైతులంతా పండించిన చెరకును ఏం చేసు కోవాలో అర్ధంకాక ఆందోళన చెందుతున్నారు. లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరకు రైతులు ఉత్పత్తి చేసిన చెరకును కొనుగోలు చేయాలని, మూత పడిన కార్మాగారాలను తెరిపించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సీతానగరం మండలంలో
చెరకు తూనిక కేంద్రాలు..
సీతానగరం మండలంలోని బూర్జ, కృష్ణారాయపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, నిడగల్లు, సీతానగరం, పణుకుపేట, బగ్గందొరవలస గ్రామాల్లో చెరకు తూనిక కేంద్రలున్నాయి. అలాగే మక్కువ, బాడంగి, తెర్లాం,బొబ్బిలి ప్రాంత గ్రామాల్లో చెరకు తూనిక యంత్రాలను ఏర్పాటు చేశారు.
చెరకు తూనిక కేంద్రాలు సిద్ధం
చెరకు తూనిక కేంద్రాలు సిద్ధం


