‘కొండ’పై అక్రమార్కుల ‘ఫిరంగి’
● మొద్దునిద్రలో రెవెన్యూ సిబ్బంది
● కొత్తవలసలో లే అవుట్లకు కంకర తరలింపు
● సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
కొత్తవలస: మండలంలో రోజురోజుకు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, గ్రావెల్ అక్రమ తవ్వకాలు పెరుగుపోతున్నాయి. ఈ తవ్వకాలు చంద్రబాబు ప్రభుత్వ పాలన ప్రారంభం నాటి నుంచి జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్ఛిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అదికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారు.దీంతో అక్రమార్కులు రెచ్చిపోయి బరితెగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కొంతమొత్తం రెవెన్యూ అధికారులకు చేరుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజులు వచ్చాయంటే చాలు అక్రమార్కులు తెరలేపుతున్నారు. అధికారులు ఎక్కువ శాతం మంది స్థానికేతరంగా ఉండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. మండలంలోని కొత్తవలస రెవెన్యూ పరిధి ఫిరంగి కొండ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.సర్వే నంబర్ 168లో సుమారు 15 సెంట్లు, సర్వే నంబర్ 168–1లో 415–37 ఎకరాల కొండ ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంంతంలో ఇప్పటికే ఎక్కువశాతం ఆక్రమణలకు గురైంది. కాగా ప్రస్తుతం ఈ కొండప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తవలస మండలంలో ఎక్కడ లేఅవుట్ వేసినా అవసరమైన గ్రావెల్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే.దీంతో అక్రమార్కులు రెండు చేతులా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు.ముందుగా కొండ ప్రాంతంలో గ్రావెల్‌ను తవ్వేసి అమ్ముకున్న తరువాత చదునైన భూమిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అలాగే రెల్లి రెవెన్యూ పరిధిలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన కొండ ప్రాంతంలో సైతం జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమార్కులను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.
తవ్వకాలు నిరోధిస్తాం
ఈ తవ్వకాలపై తహసీల్దార్ సునీతను వివరణ కోరగా సంబంధిత రెవెన్యూ కార్యదర్శిని అప్రమత్తం చేసి తవ్వకాలను నిరోధిస్తామన్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసుల నమోదుకు సిఫారసు చేస్తామని చెప్పారు.
‘కొండ’పై అక్రమార్కుల ‘ఫిరంగి’


