ఆధునిక మహిళ చరిత్ర తిరగరాసేలా గురజాడ రచనలు
● సాహితీగోష్ఠిలో ప్రముఖుల సందేశాలు
విజయనగరం టౌన్: ఆధునిక మహిళ చరిత్రను గురజాడ రచనలు తిరగరాస్తాయని ప్రముఖ సామాజికవేత్త పీఏ దేవి పేర్కొన్నారు. మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సాహితీస్రవంతి, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలోని సెమినార్ హాల్‌లో ఆదివారం సాహితీ గోష్ఠి నిర్వహించారు. గురజాడ సీ్త్ర పాత్రల ఔన్యత్యంపై సామాజికవేత్త దేవి ప్రసంగిస్తూ గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకంలో పాత్రలేవీ కల్పితాలు కావన్నారు. పాత్ర నేపథ్యాలున్నవేనని తెలిపారు. కన్యాశుల్కంలో కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, పూటకూళ్లమ్మ, బుచ్చమ్మ , మధురవాణి వంటి సీ్త్రపాత్రలన్నీ సంఘసంస్కరణకు చేయాల్సిన పనులన్నీ ఆ నాటకంలో చేసి చూపించారన్నారు. గురజాడ సాహిత్య విషయాలు ఇంకా అనేకం బయటకు రావాల్సి ఉందన్నారు. కవి, రచయిత, జర్నలిస్ట్ రెహానా మాట్లాడుతూ మధురవాణి పాత్ర ఒక వర్గానికే కాదని, సీ్త్ర ధైర్యాన్ని, ఔన్యత్యాన్ని చూపిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకులు రమాగీతాదేవి మాట్లాడుతూ గురజాడ పాత్రలు దార్శనీకమైనవన్నారు. ప్రముఖ సీ్త్రల వైద్యనిపుణురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ మాట్లాడుతూ మహిళాభ్యున్నతికి మహాకవి మహోన్నతమైన విషయాలను ప్రజల కళ్లకు కట్టినట్లు నాటకం ద్వారా చూపించి మార్పు తీసుకువచ్చారన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర సమత కన్వీనర్ జి.నిర్మల, మహిళాచేతన కార్యదర్శి కత్తిపద్మ, ఎం.సుశీల, డాక్టర్ లెక్కల చిన్నారి తదితరులు ప్రసంగించారు. గురజాడ ప్రవచించిన దేశభక్తిపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్ష్యులు తెలకపల్లి రవి ప్రసంగించారు. ప్రముఖ రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, మక్కెన శ్రీనివాస్, సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌లు గురజాడ విశిష్టతను వివరించారు. ప్రముఖుల స్మారక భవనాలు, చిహ్నాలు పరిరక్షణ – ఆవశ్యకత అనే అంశంపై ఇన్‌టాక్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు ఈమని రాణీశర్మ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్. శర్మ, తవ్వా సురేష్, గొంటి గిరిధర్, జి.మురళీధర్, ప్రొఫెసర్ కె.ఎస్.చలం, కొత్తూరి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ మహనీయుల స్మారక భవనాలను పరిరక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం కన్యాశుల్కం–సామాజిక ప్రయోజనం అనే అంశంపై జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో వేలకోట్లు ఖర్చుపెడుతోందని సమాజం కోసం దేశం కోసం కష్టపడిన వారిని గుర్తించడం లేదన్నారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్.వెంకటరావు, తవ్వాసురేష్‌లు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు గురజాడ విగ్రహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు గురజాడ గౌరవ యాత్రను నిర్వహించారు. యుగస్వరం గురజాడ పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
ఆధునిక మహిళ చరిత్ర తిరగరాసేలా గురజాడ రచనలు


