లీగ్ దశకు వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొనగా, రెండవ రోజు బుధవారం పోటీలు లీగ్ దశకు చేరుకున్నాయి. నాకౌట్ దశలో వర్సిటీ వ్యాయామ కళాశాల జట్టు 52–10, 25–14 తేడాతో చలపతి ఇంజినీరింగ్ కళాశాలపై గెలుపొంది లీగ్ దశకు చేరుకుంది. ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), ఆర్‌వీఆర్ అండ్ జేసీ కళాశాల జట్లు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 25–24, 25–12, 17–15 తేడాతో ధనలక్ష్మి కళాశాల జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు 25–20, 25–16 తేడాతో వరుస సెట్లతో ఏపీఆర్‌డీసీ నాగార్జునసాగర్ జట్టుపై విజయం సాధించింది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 15–25, 25–21, 06–15 తేడాతో గెలుపొంది లీగ్ దశకు చేరుకొంది. లీగ్ దశకు చేరుకున్న కళాశాలల జట్లు గురువారం పోటీ పడతాయని టోర్నమెంట్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు తెలిపారు. వర్సిటీ జట్టును ఎంపిక చేస్తారని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్‌కే సతీష్‌బాబు, లక్ష్య కళాశాల డైరెక్టర్ హరిబాబు, ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు, శ్రీ చైతన్య కళాశాల డీన్ కృష్ణ, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు.
తలపడనున్న కృష్ణవేణి, ధనలక్ష్మి, బాపట్ల కళాశాలల జట్లు
లీగ్ దశకు వాలీబాల్ పోటీలు


