పల్నాటి వీరుల ఆయుధాలకు ఘనంగా వీడ్కోలు
కారెంపూడి: ఐదు రోజులుగా పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. వీరాచారులు ఉదయాన్నే నాగులేరు గంగధారి ఒడ్డున వీరుల ఆయుధాల అలంకారాలు తీసివేసి నూతన అలంకారాలు చేశారు. తర్వాత ఊరేగింపుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికెళ్లి ఆయనను తోడ్కొని చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. చెన్నకేశవునికి పూజలు చేశాక తీర్థం తీసుకున్నారు. ఆలయం ముందు మరికొందరు వీరంగమాడారు. తర్వాత బ్రహ్మనాయుడు విగ్రహానికి పూజలు చేశారు. అంకాలమ్మను దర్శించుకున్నారు. అంతా కలిసి నాయకురాలు నాగమ్మ వేషంలో ఉన్న వీరాచారుడిని తరుముకుంటూ లంకన్న ఒరుగు ప్రాంతానికి పరుగున చేరుకున్నారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ నాయకత్వంలో వీరాచారులంతా రణక్షేత్ర వీధుల్లో ఉగ్రరూపంలో పరుగు లాంటి నడకతో విషాద వదనాలతో లంకన్న ఒరుగుకు చేరుకున్నారు. అక్కడ లంకన్న వేషధారణలో మృతి చెందినట్లుగా పడి ఉన్న లంకన్న పాత్ర పోషిస్తున్న ఆచారవంతుని వద్దకు వారంతా చేరుకున్నారు. అక్కడ పెద్దపెట్టున ఏడుపులు విన్పించాయి. విషాద వదనాలతో అంతా ఉద్విగ్నంగా ఉన్నారు. లంకన్న వద్దకు పీఠాధిపతి చేరుకుని ముసుగు తొలగించి ఆయన నోట్లో శంఖుతీర్థం పోసి ప్రాణ ప్రతిష్ట చేసిన ఘట్టాన్ని ప్రదర్శించారు. తర్వాత ఆచారవంతులంతా లంకన్నను తోడ్కొని నాగులేరు గంగధారిలో స్నానం ఆచరింపచేశారు. బ్రహ్మనాయుడు లంకన్నకు ప్రాణ ప్రతిష్ట చేశాడనే చారిత్రక గాథను ఉత్సవాలలో నాటకీయంగా ప్రదర్శించారు.
ఆసాంతం ప్రశాంతంగా..
సాయంత్రం వీరుల ఆయుధాలన్నింటికి నాగులేరు ఒడ్డున అలంకారాలు తీసి వేశారు. ఆయుధాలను శుభ్రం చేశారు. రాత్రికి శంఖుతీర్థ మండపంలో బ్రహ్మనాయుడు పాత్రలో ఉన్న పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇచ్చిన తీర్థం తీసుకుని అలంకారాలు లేని ఆయుధాలతో వీరాచారులు పరుగులు తీస్తూ ఆయుధాలకున్న గంటలు మోగిస్తూ కారెంపూడి వీధులను కలియతిరిగారు. వీరుల ఆయుధాలు కళ్లికి ఒరిగాయి. దీంతో కళ్లిపాడు ఉత్సవ ఘట్టం ముగిసింది. అప్పటికే కళ్లి మండల కోసం వేచి ఉన్న ప్రజలు వాటిని తీసుకుని పొలాలలో చల్లుకున్నారు. ఇళ్లలో పెట్టుకున్నారు. దీంతో ఉత్సవాలు ముగిశాయి. మరో వైపు అప్పటికే వీరాచారుల కుటుంబాలు స్వస్థలాల ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు.


