
కొలిక్కి రాని సచివాలయ ఉద్యోగుల బదిలీలు
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీలు గందరగోళంగా మారాయి. గుంటూరు అర్బన్ పరిధిలో జరిగిన బదిలీల్లో సిఫార్సు లేఖలతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. రూరల్ పరిధిలో కూడా ఇంకా గందరగోళం నెలకొంది. గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ బదిలీల ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఉమ్మడి జిల్లాలో వీరి బదిలీల ప్రక్రియ గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మొత్తం 874 మంది ఉండగా.. సిఫార్సు లేఖలను దృష్టిలో పెట్టుకుని తమను ఎక్కడికి బదిలీ చేస్తారో అని వేచిచూస్తున్నారు.
కౌన్సెలింగ్‌కు పిలవకుండానే...
అర్బన్ పరిధిలో పనిచేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు గత నెల 28, 29వ తేదీల్లో గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహించారు. రూరల్ పరిధిలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ల బదిలీలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించలేదు. గూగుల్ ఫాంలో 5 ఆప్షన్లు ఇవ్వాలని వారం క్రితం సూచించారు. ఆ మేరకు ఉద్యోగులు నమోదు చేశారు. ఇంత వరకు దీనిపై సమాధానం రాకపోవడంతో ఉద్యోగులు వారిని సంప్రదించారు. బదిలీల ప్రక్రియ నడుస్తోంది.. సమాచారం అందిస్తామని నేటికీ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు.
సిఫార్సు లేఖలతో మల్లగుల్లాలు
సాధారణంగా బదిలీల ప్రక్రియ జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలి. ఆ వివరాలను హోల్డ్‌లో ఉంచి ఫించన్ల పంపిణీ తరువాత విడుదల చేయాలి. సామాజికి ఫించన్ల పంపిణీ చాలా వరకు పూర్తయినప్పటికీ బదిలీల ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదు. కోరుకున్న గ్రామ సచివాలయంలో పోస్టింగ్ ఇవ్వాలని సిఫార్సు లేఖలు కుప్పలు కుప్పలుగా ఉద్యోగులు ఇవ్వడంతో లిస్ట్ ఫైనల్ అయినప్పటికీ మార్పుచేర్పులతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. కార్యాలయంలో రాత్రుళ్లు కూడా దీనిపైనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్యను దీనిపై వివరణ కోరేందుకు ఫోన్ చేయగా, ఆయన సమాధానం ఇవ్వలేదు.
ఐదు ఆప్షన్లు ఇచ్చిన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగులు సిఫార్సు లేఖలు ఎక్కువగా రావడంతో తుది జాబితాపై అధికారుల కసరత్తు