
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలి
చిలకలూరిపేట: వివక్ష లేకుండా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలని వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు కోరారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో సోమవారం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించారు. ఎజెండాలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులపై చర్చ రాగా, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో మాత్రమే కాకుండా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిల్ట్ తొలగింపు విషయంలో మాట్లాడుతూ పట్టణ పరిధిలో భారీగా మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగించామంటున్నారు... తొలగిస్తే మురుగు సమస్య ఎందుకు తలెత్తుతున్నది? సరిగ్గా తొలగించలేదా అని ప్రశ్నించారు. పట్టణ పరిధిలో వెలువడే మురుగునీరు గణపవరం వద్ద కుప్పగంజి వాగులోకి సరిగా ప్రవహించే పరిస్థితి లేక పంట పొలాల్లో మురుగునీరు నిల్వ ఉండి రైతులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం తెలిపారు. తిరిగి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విశ్వనాధ సెంటర్‌లో భారీ వృక్షాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసిన విషయమై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయం ఎత్తినప్పుడు పోలీసు కేసు పెడతామని, సంబంధిత వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఈ చెట్టు నరికివేత విషయంలో మున్సిపాలిటీ హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈ ప్రశ్నకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లభించకపోవడం విశేషం. ఇదే విషయాన్ని 27వ వార్డు కౌన్సిలర్ అన్నపరెడ్డి శ్రీలక్ష్మి కూడా ప్రశ్నించారు. అమృత్ పథకం ఎప్పటికి పూర్తి అవుతుంది, ఈ పథకం కింద పైపులైన్లు ఏర్పాటు చేసిన సందర్బంగా ఏర్పడిన గోతులు ఇంకా చాలా చోట్ల పూడ్చాల్సి ఉందని సభ్యులు ప్రశ్నించారు. దీనికి మున్సిపల్ డీఈఈ అబ్దుల్ రహీం మాట్లాడుతూ అమృత్ పథకం పనులు పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్డ్‌మెంట్ వారు నిర్వహిస్తున్నారని, సీసీ ప్లాచ్‌వర్కులు వారే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. చెత్త తొలగించేందుకు అద్దె టాక్టర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు, మున్సిపల్ ట్రాక్టర్లు ఏమయ్యాయంటూ పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ప్రశ్నించారు. మున్సిపల్ ట్రాక్టర్లు రిపేర్లకు వచ్చిన క్రమంలో అద్దె ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నామని డీఈఈ తెలిపారు. 12వ వార్డు కౌన్సిలర్ యడ్ల ఇందిరా మాట్లాడుతూ తన వార్డు పరిధిలోని తూర్పుమాలపల్లెలో ఒక్క అభివృద్ధి పని నిర్వహించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు వార్డు వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మాట్లాడుతూ తూర్పు మాలపల్లెలో అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలని మున్సిపల్ ఏఈని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు.
వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు
మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహణ

అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలి